New Delhi, March 23: ఎటువంటి చర్చ లేకుండా మూజువాణి ఓటు (Voice Vote) ద్వారా ఫైనాన్స్ బిల్లు 2020 (Finance Bill 2020)ను లోక్‌సభ (Lok Sabha) సోమవారం ఆమోదించింది. ఆ వెంటనే సభ నిరవధిక కాలానికి వాయిదా పడింది. అంతకుముందు, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు మధ్యాహ్నం 1.30 గంటలకు సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా తమ పార్టీ ఎంపీలు పార్లమెంటు బడ్జెట్ సమావేశానికి హాజరుకామని తృణమూల్ కాంగ్రెస్, శివసేన పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ కూడా రోజువారీ కార్యక్రమాలు ముగిసిన తర్వాత వాయిదా వేస్తామని చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.
వాస్తవానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చేనెల ఏప్రిల్ 03 వరకు జరగాల్సి ఉన్నా, కరోనావైరస్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఉభయసభలు ఈరోజుతోనే ముగించారు.
నిత్యం వీవీఐపీల రాకపోకలతో కళకళలాడే పార్లమెంట్ ప్రాంగణం సోమవారం నాడు ఎడారిని తలపించింది. కరోనావైరస్ వ్యాప్తి భయాందోళనల నేపథ్యంలో చాలావరకు సభ్యులు గైర్హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉభయ సభలు ప్రారంభమై, బడ్జెట్ -2020పై సాధారణ చర్చ జరగాల్సి ఉంది. కానీ, వచ్చిన అతికొద్ది మంది సభ్యులు సైతం పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సమావేశాలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం మధ్యాహ్నం 2:35 గంటలకు మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ద్రవ్యవినిమయ బిల్లు-2020ను ప్రవేశపెట్టారు. దీనిపై సభలో ఎలాంటి చర్చ జరగలేదు, 2:55 గంటలకు స్పీకర్ ఓంబిర్లా వాయిస్ ఓటు ద్వారా ఆమోదం పొందినట్లుగా ప్రకటించారు. ఆ వెంటనే లోకసభను నిరవధిక వాయిదా వేశారు.
ఇప్పటికే ముగ్గురు బీజేపీ ఎంపీలు మురళీధరన్, సురేష్ ప్రభు, దుష్యంత్ సింగ్ లు కరోనావైరస్ లక్షణాల అనుమానంతో స్వీయ నిర్బంధం లోకి వెళ్లడంతో పార్లమెంటుకు హాజరయ్యేందుకు మిగతా సభ్యులు కూడా భయాందోళనలకు గురయ్యారు. టీఎంసీ, కాంగ్రెస్ శివసేన మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు తాము హాజరుకాలేమని చెబుతూనే సమావేశాలను వాయిదా వేయాలని డిమాండ్ చేశాయి.
ఈ క్రమంలో ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ కంటే 12 రోజుల ముందుగానే నిరవధిక వాయిదాపడ్డాయి.