New Delhi, February 10: పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) ను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని దిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో జరుగుతున్న నిరసనల పట్ల సుప్రీంకోర్ట్ (Supreme Court) సోమవారం విచారించింది. నిరసనకారులకు వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులను జారీచేయనప్పటికీ, ప్రజారహదారులను అడ్డగిస్తూ నిరవధిక నిరసనలు చేయడాన్ని సుప్రీం ప్రశ్నించింది. "ప్రజలు నిరసన తెలపొచ్చు, అయితే అందుకంటూ ఒక చోటు ఉంటుంది, అంతేకానీ నిరవధికంగా ప్రజారహదారులను నిరసనలతో అడ్డుకోవడం తగదు" అని కోర్ట్ పేర్కొంది.
షాహీన్ బాగ్ (Shaheen Bagh) లో నిరసనకారులు రహదారులను దిగ్భంధిస్తున్నారు. రెండు నెలలు కావొస్తున్నా అక్కడ నిరసనలు విరమించడం లేదు, దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు, వారిని వెంటనే ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లపై కె.ఎం.జోసెఫ్ సహా ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్ట్ ధర్మాసనం సోమవారం విచారించింది. నిత్యం రద్దీగా ఉండే చోట కాకుండా నిరసనకారులు మరోచోటును ఎంచుకోవాల్సిందిగా సూచించింది. నిరసనలు వ్యక్తం చేసే ప్రాంతాన్ని నిర్వచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మరియు దిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్ట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది.
ANI Update:
Shaheen Bagh protest matter: Supreme Court issues notice to Delhi Government & Delhi Police and posts the matter for 17th February. https://t.co/WpMB1EGXf6
— ANI (@ANI) February 10, 2020
కాగా, సుప్రీం సూచనల పట్ల స్పందించిన షాహీన్ బాగ్ నిరసన కారులు సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీడియాకు వివరించారు. "కోర్టు నిర్దేశిస్తే, మేము జంతర్ మంతర్ లేదా రామ్ లీలా మైదాన్ ప్రాంతాలను ఎంపిక చేసుకుంటాం, అయితే ఏదిఏమైనా మా నిరసనలు మాత్రం కొనసాగుతాయి" అని పేర్కొన్నారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో హింసకు మైనారిటీలకు (హిందూ, సిక్కు తదితర ముస్లింమేతరులకు) భారత పౌరసత్వం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్టం ప్రవేశపెట్టింది. అప్పట్నించీ ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టే నిరసనలకు దిల్లీలోని షాహీన్ బాగ్ కేంద్రంగా మారింది.