PM Narendra at Modi Meeting. (Photo Credits: ANI)

New Delhi, August 18: అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న భారత పౌరులందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. అఫ్గనిస్తాన్‌ దేశం తాలిబాన్ వశమైన నేపథ్యంలో అక్కడ తలెత్తిన సంక్షోభ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సెక్యూరిటీ కేబినెట్ కమిటీ (CCS) సమావేశం జరిగింది. అఫ్గాన్‌లోని భారతీయుల భద్రతపై సమావేశంలో చర్చించారు. అఫ్గాన్‌లో చిక్కుకున్న ప్రతీ ఒక్క భారతీయుడిని సురక్షితంగా తరలించేలా ఏర్పాట్లు చూడాలని, మరియు ఆ దేశంలోని సిక్కు, హిందూ మైనారిటీలకు ఆశ్రయం కల్పించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. భారతీయులే కాకుండా భారత్ నుంచి సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు కూడా అన్ని విధాల సహాయం అందించాలని ప్రధాని సూచించారు.

ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా మరియు రాయబారి రుద్రేంద్ర టాండన్ CCS సమావేశంలో పాల్గొన్నారు. ఇదే అంశపై బుధవారం కూడా మరోసారి సెక్యూరిటీ కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. అఫ్గాన్ నుంచి భారత పౌరుల తరలింపు ఏర్పాట్లపై ఈరోజు మరోసారి చర్చించనున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికే భారత వాయుసేన ఎయిర్‌క్రాఫ్ట్ సి-17 విమానం మంగళవారం ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ నుండి భారతీయులను గుజరాత్ లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్‌ కు తీసుకువచ్చింది. ఇరాన్ మీదుగా IAF C-17 విమానం జామ్‌నగర్‌కు చేరుకుందని సంబంధిత అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బంది, ITBP సైనికులు, మీడియా సిబ్బందితో సహా 140 మంది భారతీయుల్ని తీసుకువచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ మాట్లాడుతూ.. యుద్ధ పరిస్థితుల నుంచి సురక్షిత దేశానికి చేరుకున్నామని తెలిపారు. కాబూల్ లోని భారత రాయబార కార్యాలయానికి వచ్చినవారందరినీ తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేశామని, ఇది ప్రభుత్వ కృషితోనే సాధ్యమైందని తెలిపారు.

ఇక, కాబూల్‌లో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఆఫ్గనిస్తాన్ లోని భారత జాతీయులను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భారత్ తిరిగి రావాలనుకునే వారి ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందని, కాని కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రధాన సవాలుగా మారాయని, ఈ విషయంపై అక్కడి వారితో చర్చలు జరుగుతున్నాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాబూల్ పరిస్థితిని బట్టి, అక్కడి భారతీయుల గురించి కచ్చితమైన సమాచారం ముఖ్యమని, ఎవరి వద్దనైనా ముఖ్య సమాచారం ఉంటే వారి +91-9717785379 ఫోన్ నెంబర్ కి కాని MEAHelpdeskIndia@gmail.com ఇమెయిల్‌కి అందించాలని మంత్రి కోరారు.