PM Narendra Modi at Pariksha Pe Charcha 2020 (Photo Credits: PMO India)

New Delhi, January 20: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  (Narendra Modi) తన 'పరీక్ష పే చర్చ 2020' / Pariksha Pe Charcha 2020 ( పరీక్షల మీద చర్చ) కార్యక్రమం యొక్క మూడవ ఎడిషన్ లో సోమవారం పాల్గొన్నారు.  విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి, పరీక్ష వేళ్లల్లో సాధారణంగా ఉండే ఒత్తిడిని ఎలా జయించాలి? అనే విషయాలపై విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సావధానంగా సమాధానం ఇస్తూపోయారు, ఒత్తిడిని జయించటానికి కొన్ని చిట్కాలను చెప్పారు. అలాగే విజయం సాధించడం అంటే ఏంటి అనే అంశపై మోదీ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ పరీక్ష పే చర్చలో భాగంగా ఓ విద్యార్థి మాట్లాడుతూ 'అసలు పరీక్షల సమయంలో చదవడానికి ఆసక్తి సన్నగిల్లితే లేదా పరీక్షలకు సన్నదమయ్యేందుకు సరైన ప్రేరణ లభించకపోతే ఏం చేయాలి' ? అని ప్రశ్న అడిగాడు.

దీనికి ప్రధాని మోదీ జవాబు చెప్పుతూ.. అపజయాలు కలిగినపుడు నిరాసక్తత, ప్రేరణ దొరకకపోవడం జీవితంలో చాలా సార్లు ఎదురయ్యే సవాల్లే, ఉదాహారణకు చంద్రయాణ్-2 మిషన్ కోసం అందరూ రాత్రంతా మేల్కొని కష్టపడ్డారు, అయినా ఆశించిన ఫలితం రాకపోవడంతో మనమంతా నిరాశ చెందాం. కానీ ఆ తర్వాత కూడా మన ప్రయత్నాలను ఆపలేదు, వైఫల్యాలు రావడం జీవితంలో మామూలే' అని మోదీ జవాబిచ్చారు. మరో ఉదాహరణ చెబుతూ ఒకప్పుడు ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగేటపుడు టీమిండియా వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. 2001లో ఈడెన్ గార్డెన్స్ లో జరిగి టెస్టు మ్యాచ్ లో ఇండియా ఫాలో ఆన్ ఆడుతుంది. దాదాపు ఓటమి ఖాయమైపోయినా, ద్రవిడ్- లక్ష్మణ్ ఏ మాత్రం నిరాశ చెందకుడా పట్టుదలతో ప్రయత్న చేసి భారత్ కు విజయాన్ని సాధించి పెట్టారు. తాత్కాలిక ఎదురుదెబ్బలు మన విజయాలను ఆపలేవు అని చెప్పేందుకు ఆ విజయమే నిదర్శనం' అని మోదీ పేర్కొన్నారు.

చదువుతో పాటు పాఠ్యేతర కార్యకలాపాల (extra-curricular activities) ప్రాముఖ్యత గురించి ముగ్గురు విద్యార్థులు మోదీని ప్రశ్నించారు. దానికి బదులు చెప్తూ, పాఠ్యేతర కార్యకలాపాలు లేకపోతే మనిషి రోబోట్ లాగా తయారవుతాడు, జీవితం యాంత్రికంగా మారుతుందని మోదీ అన్నారు. పిల్లలు దేనినైతే ఇష్టపడతారో, దేనిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారో ఆ రంగంలో వారికి ఇప్పట్నించే మంచి ప్రోత్సహం అందించాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు.