New Delhi: భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న జరగనున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 సమయంలో మోదీ ప్రసంగం ఖరారైంది. అదేరోజు అదే వేదికపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రసంగించనున్నారు. మోదీ ప్రసంగం పూర్తయిన రెండు-మూడు గంటల తర్వాత ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం ఉండబోతుంది.
ఇప్పటివరకూ ఉన్న సమాచారం మేరకు మోదీ ప్రసంగంలో ముఖ్యంగా అభివృద్ధి, వాతావరణ మార్పులు, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలు ఉండనున్నాయి. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ వ్యవహార ధోరణి, అది చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఐరాస వేదిక మోదీ ఎండగట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో పాల్గోనేందుకు సెప్టెంబర్ 24నే మోదీ న్యూయార్క్ చేరుకోనున్నారు.
ఇక ఇటు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అంశంపైనే మాట్లాడనున్నారు. ఐరాసలో జమ్మూ కాశ్మీర్ అంశంపైనే తమ ఫోకస్ ఉండనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ఇదివరకే ప్రకటించారు. ఇటీవల పాకిస్థాన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్, జమ్మూ కాశ్మీర్ అంశంలో తమకు ఏ దేశం మద్ధతిచ్చినా, ఇవ్వకపోయినా తాము ఒంటరిగానైనా పోరాడతామని స్పష్టం చేశారు.
కనీసం ఇస్లాం దేశాలు కూడా తమకు మద్ధతు ఇవ్వకపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేశారు. మిగతా ఇస్లాం దేశాలన్నింటికి ముస్లింల బాగుకన్నా తమ స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
అయితే భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఎలాంటి ఆరోపణలు చేసినా వాటికి దీటుగా జవాబు ఇస్తామని భారత ప్రతినిధులు స్పష్టంచేశారు. మరోవైపు కాశ్మీర్ లో హింస జరుగుతుందటూ రెచ్చగొట్టే విధంగా పాకిస్థాన్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. పాక్ నాయకులవి బుద్ధి లేని, "బాధ్యతా రాహిత్యమైన ప్రకటనలు" (irresponsible statements) అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా కాశ్మీర్ లోయలో ఒక బుల్లెట్ కూడా ప్రయోగించబడలేదని, ఒక్క ప్రాణం కూడా పోలేదని రవీష్ సూటిగా చెపారు. తమ అంతర్గత వ్యవహారాలలో పాకిస్థాన్ అనవసర జోక్యం తగదని ఆయన హెచ్చరించారు.