PM Narendra Modi (Photo Credits: ANI)

New Delhi, May 12: ప్రపంచ ఆరోగ్య సంస్థను (WHO) పునర్వ్యవస్థీకరించాలని అభిప్రాయపడ్డారు ప్రధాని మోదీ(NArendra Modi). రెండవ గ్లోబల్ కోవిడ్ సమ్మిట్‌లో భాగంగా గురువారం మోదీ, ప్రపంచ దేశాలను ఉద్దేశించి మాట్లాడారు. డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలు అవసరమని సూచించారు. ‘‘డబ్ల్యూహెచ్ఓను పునర్వ్యవస్థీకరించి, మరింత బలోపేతం చేయాలి. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పరస్పర సహకారంతో కూడిన వ్యవస్థ ఏర్పాటు చేయాలి. వ్యాక్సిన్లు, మెడిసిన్స్ అందరికీ అందుబాటులో ఉండే సరఫరా వ్యవస్థను నిర్మించాలి అని కోరారు. అంతేకాదు కోవిడ్ ప్యాండమిక్ సమయంలో ప్రపంచానికి టీకాలు అందించడంలో భారత్ ప్రముఖ పాత్ర పోషించిందన్నారు ప్రధాని మోదీ.

బాధ్యతాయుత సభ్య దేశంగా డబ్ల్యూహెచ్ఓ (WHO) పునర్వ్యవస్థీకరణలో కీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధం. ప్యాండెమిక్ టైమ్‌లో ప్రజలే కేంద్రీకృతంగా పనిచేశాం. ప్రజల ఆరోగ్యం కోసం అత్యధిక బడ్జెట్ కేటాయించాం. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాం. దాదాపు 90 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించాం. ఐదు కోట్ల పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ పూర్తైంది. 98 దేశాలకు 200 మిలియన్ల డోసుల వ్యాక్సిన్లు అందించాం’’ అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మరోవైపు దేశంలో కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సంప్రదాయ వైద్యాన్ని కూడా ఉపయోగించినట్లు చెప్పారు.