భారత 73వ స్వాతంత్య్ర దినోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో జమ్మూకాశ్మీర్ ప్రజలు మంచి పురోగతి సాధిస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉందని రాష్ట్రపతి చెప్పారు. కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ ప్రాంతాలు ఇకపై బాగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన రామ్ నాథ్ దేశ దేశానికి సంబంధించిన ఎన్నో అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని హైలైట్స్:
- మనకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కానుకగా ఇచ్చిన మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మరువలేనివి. 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా వారందరినీ మనస్పూర్థిగా స్మరించుకుందాం.
- భారతీయులకు సవాళ్లేమి కొత్త కాదు. నేడు మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని గాంధీజీ అప్పట్లోనే ఎదుర్కొన్నాడు. తన సహనం, ఓర్పు ద్వారా వాటన్నింటికీ అప్పట్లోనే పరిష్కారం చూపారు. ఈ ఏడాది, మనం మహాత్మా గాంధీ 150వ జయంతిని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఆనాడు ఆయన చూపిన దారి నేటికీ అనుసరించాల్సిన అవసరం ఉంది.
- ఇదే ఏడాది గురు నానక్ దేవ్ 550వ జయంతి కూడా రాబోతుంది. ఒకే ఏడాదిలో మహాత్ముని 150వ జయంతి, గురునానక్ 550 జయంతి రావడం ఒక అపూర్వ ఘట్టం.
- ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రజలు బహుళ ప్రయోజనాలు పొందుతారు. భారతదేశంలోని మిగతా ప్రాంతాల ప్రజలు ఏవైతే హక్కులు మరియు ప్రయోజనాలు అనుభవిస్తున్నారో ఇక మీదట జమ్మూకాశ్మీర్ ప్రజలకూ అలాంటి వీలు కలుగుతుంది.
- ఈసారి ఓటర్లు గణనీయంగా పెరిగి వారంతా గత సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారందరికీ అభినందనలు. ఇదే ప్రజాస్వామ్యంలో అతిగొప్ప విజయం.
- ఉభయ సభల్లో 30 బిల్లులను ఆమోదించిన 2019 పార్లమెంటరీ సమావేశం ఎంతో ఉత్పాదకరమైనది. లోకసభ మరియు రాజ్యసభల్లో నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయి. ప్రజలకు ఉపయోగపడే కీలకమైన ఎన్నో బిల్లులు ఆమోదించబడ్డాయి. ఇవే పార్లమెంట్ సమావేశాలను స్పూర్థిగా తీసుకొని రాష్ట్ర అసెంబ్లీలు ముందుకు సాగాలి.
- జాతి నిర్మాణం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ, ఇందులో అందరి భాగస్వామ్యం ఉండాలి. పాలకులు, అధికార యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేయాలి.
- భారతదేశంలో ప్రజల వైవిధ్యం ఉన్నప్పటికీ, వారి ఆకాంక్షలలో ఎలాంటి వైవిధ్యం లేదు. "భారతీయులు వారి అభిరుచులలో మరియు అలవాట్లలో చాలా భిన్నంగా ఉంటారు, కాని వారి కలలు ఒకటే" పౌరుల ఆకాంక్షలను సాకారం చేయడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి.
- ప్రగతి సాధించడానికి ఆర్థిక, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి. మారుమూల ప్రాంతాలకు సైతం చేరుకునేలా మంచి రోడ్లు, చక్కని రవాణా వ్యవస్థ ఏర్పాటవుతున్నాయి. సామాన్యులకు కూడా విమాన ప్రయాణం ఇప్పుడు అందుబాటులో ఉంది.
- మహిళలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి వారి ఆశయాలను సాధించేలా ప్రతి ఒక్కరు తోడ్పాటును అందిస్తేనే ఒక సార్థకత ఉంటుంది. మహిళల గౌరవాన్ని పెంచే బాధ్యత అందరిది.
- 'మనం బ్రతుకుదాం, ఇంకొకరిని బ్రతకనిద్దాం'. ప్రపంచంలోని ఇతర దేశాలతో భారతదేశం ఎల్లప్పుడు ఇలాంటి ధోరణినే కలిగి ఉంటుంది. భారతదేశ సంస్కృతి, సహనం, ఇతరుల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకునే స్వభావంతో ఉన్నతమైన దౌత్య సంబంధాలను కలిగి ఉంటుంది. అది భారతదేశానికి మాత్రమే తెలిసిన మాయాజాలం.
- చంద్రుడిపై అడుగు పెట్టే ధైర్యం మన సొంతం, ఏదైనా సాధించగలిగే యువత మన సంపద. మన ఆదర్శాలు, మన మధ్య సోదరభావం మనతో ఎప్పటికీ ఉండాలి. అదే ఎల్లప్పుడూ మమ్మల్ని ఆశీర్వదిస్తుంది మరియు భారతదేశాన్ని ఆశీర్వదిస్తుంది. జై హింద్! అంటూ రాష్ట్రపతి ప్రసంగం ముగిసింది.
ఇదిలా ఉండగా, 73వ స్వాతంత్య్ర వేడుకల కోసం యావత్ భారతావని ఘనంగా ముస్తాబైంది. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర శోభ రమణీయంగా కనిపిస్తుంది.