Gurdaspur, September 04: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కర్మాగారం (Firecracker factory)లో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. నివేదికల ప్రకారం, జిల్లాలోని బటాలా పట్టణంలో ఉన్న ఈ కర్మాగారంలో మరో 50 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం అందుతుంది. పేలుడు ధాటికి బాణాసంచా కార్మాగారం బూడిదవగా, సమీప భవనాలు కూడా ధ్వంసం అయినట్లు తెలియవచ్చింది.
సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. జిల్లా అధికారులు, NDRF, SDRF బృందాలు పేలుడు జరిగిన ప్రదేశానికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఘటన స్థలాన్ని, ప్రమాదం జరిగిన తీరును జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారు.
సెప్టెంబర్ 5న తలపెట్టిన గురు నానక్ దేవ్ (Gurunanak Dev)వివాహ వార్షికోత్సవ వేడుకలలో ఈ బాణసంచాను ఉపయోగించాల్సి ఉంది. ఆ కార్యక్రమం కోసం బాణాసంచా తయారు చేస్తుండగా దురదృష్టవషాత్తూ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 100 మంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఘటన జరిగిన ప్రదేశంలో పరిస్థితి
ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ (Amarinder Singh )తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమన్నారు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.