Chennai, March 05: చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో అరుదైన ఘట్టం నెలకొంది. నగరానికి తొలి దళిత మేయర్(first ever Dalit woman ) గా రికార్డు సృష్టించారు ఆర్. ప్రియ (R.Priya). ఆమె వయస్సు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. ఆర్.ప్రియ చెన్నై(Chennai) నగరానికి 49వ మేయర్. అంటే ఆమెకు ముందు 48 మంది మేయర్లు ఆ నగరానికి పని చేస్తే వారిలో ఇద్దరే మహిళా మేయర్లు. 1957లో కాంగ్రెస్ నుంచి తారా చెరియన్, 1971లో డి.ఎం.కె నుంచి కామాక్షి జయరామన్‌లు మాత్రమే మేయర్లుగా పని చేశారు. మిగిలిన వారంతా పురుషులే. ఇక దళిత మహిళ ఈ స్థానంలో కూచోవడం అనేది చరిత్రలోనే లేదు. కాని ఆర్.ప్రియ దళిత మహిళగా ఆ రికార్డును తన సొంతం చేసుకుంది. ఇదంతా ఆమెకు రాసి పెట్టినట్టుగా క్షణాల్లో జరిగిపోయింది గాని సరైన సమయంలో తాను రాజకీయాల్లో దిగాలి అని ప్రియ భావించడం వల్ల కూడా ఈ ఘనత సాధ్యమైంది.
Tamil Nadu | Greater Chennai Corporation gets its youngest and first-ever Dalit woman mayor, as DMK's R Priya takes the oath of office in Chennai. The 29-year-old is Chennai’s third woman mayor. pic.twitter.com/erfAt365h0
— ANI (@ANI) March 4, 2022
చెన్నై నగరానికి గత ఐదేళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. స్టాలిన్ (Stalin) ప్రభుత్వం వచ్చాక ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రేటర్ చెన్నైలోని 200 వార్డులలో 153 స్థానాలు డి.ఎం.కెకు వచ్చాయి. ఇంకో 25 స్థానాలు డి.ఎం.కె మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. అన్నా డిఎంకెకు (DMK)కేవలం 15 వార్డులు దక్కాయి. ఈసారి ఎన్నికలలో చెన్నై మేయర్ పదవిని దళిత మహిళకు రిజర్వ్ చేయడం వల్ల నార్త్ చెన్నై 74వ వార్డు (తిరువికనగర్) నుంచి గెలిచిన ఆర్.ప్రియకు ఏకగ్రీవంగా ఈ పదవి దక్కింది. మార్చి 4, శుక్రవారం ఆమె మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
‘చెన్నైకి మేయర్‌గా చేసిన స్టాలిన్ మార్గదర్శనంలో నేను మేయర్‌గా పని చేసే అవకాశం రావడం గొప్ప విషయం’ అంది ప్రియ. ఆమె కుటుంబం డిఎంకెకి వీరభక్తులు. ఆమె తండ్రి ఆర్.రాజన్ ముప్పై ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నాడు. ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండటంతో 18 ఏళ్ల వయసులో ప్రియ కూడా డి.ఎం.కె కార్యకర్త అయ్యింది. ‘అయితే నేను నిజంగా పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొంది స్టాలిన్ సి.ఎం అయ్యాకే. ఆయన పాలనా పద్ధతులు గమనించాక నా ప్రాంత సమస్యలు తీరాలంటే ఇదే అదను అని నాకు అనిపించి నేను కూడా పని చేయడం మొదలుపెట్టాను’ అంది ప్రియ. ఎం.కాం చేసిన ప్రియకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ‘నిజానికి ఎలక్షన్లకు ముందే నా గెలుపు ఖాయమైపోయింది. నా ప్రాంత సమస్యలను వేటి వేటిని తీరుస్తానో నేను చెప్పాక అందరూ నాకే ఓటు వేస్తామని చెప్పేశారు’ అంది ప్రియ. సాధారణంగా నార్త్ చెన్నై ప్రాంతం చాలా ఏళ్లుగా సౌకర్యాల ఏర్పాట్లలో నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. ఆ ప్రాంతం నుంచి ఇప్పుడు ఏకంగా మేయరే రావడం అందరూ ఎన్నో అంచనాలతో ప్రియ వైపు చూస్తున్నారు.
‘మా ఏరియా స్త్రీలు వేసవిలో 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆటోల్లో 4 కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. ముందు దీనిని మార్చాలి. పారిశుద్ధ్యం ముఖ్యం. అలాగే పిల్లలకు ఆటస్థలాలు ఏర్పాటు చేయాలి. స్టాలిన్ యువ శక్తికి పూర్తి అవకాశం ఇస్తున్నారు. నేను బాగా పని చేయాలనుకుంటున్నాను’ అంది ప్రియ.
స్టాలిన్ ప్రభుత్వం ఈసారి స్త్రీలకు పట్టణ, నగర పాలనా వ్యవస్థల బాధ్యతలు అప్పజెప్పడంలో శ్రద్ధ పెట్టింది. తమిళనాడులో మొత్తం 11 మేయర్ పదవులను, 5 డిప్యూటీ మేయర్ పదవులను స్త్రీలకు కేటాయించింది. కోయంబత్తూరు మేయర్‌గా మధ్యతరగతికి చెందిన ఏ.కల్పన అనే మహిళను ఎంపిక చేసింది. అయితే జయలలిత హయాంలో స్త్రీలు పదవుల్లోకి వచ్చాక వారి భర్తలు, తండ్రులు, సోదరులు పెత్తనం చెలాయించి ఆ గెలిచిన స్త్రీలను వెనక్కు నెట్టడం కొన్నిచోట్ల కనిపించేది.
‘అలా నా విషయంలో జరగదు. ఇప్పుడు స్త్రీలు తమ ఇళ్ల పురుషులకు ఆ అవకాశం ఇవ్వరు. వారు తమ పూర్తి శక్తి సామర్థ్యాలతో పని చేయాలనుకుంటున్నారు. మీరే చూస్తారుగా’ అంది ప్రియ.