New Delhi, June 08: కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే వయనాడ్ (Wayanad) సీటును రాహుల్ గాంధీ ఖాళీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాయ్‌బరేలీ ఎంపీ హోదాను అలాగే ఉంచుకోవాలని, ఎందుకంటే యూపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంటుందని యూపీ కాంగ్రెస్ కమిటీ (UP Congress) పేర్కొన్నది. వయనాడ్‌లోనే ఉండాలని తొలుత కేరళ కాంగ్రెస్ కూడా కోరినా.. యూపీ కాంగ్రెస్ అభ్యర్థన తర్వాత వాళ్లు కూడా వెనక్కి తగ్గారు. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో దీనిపై చర్చ వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే రెండు నియోజకవర్గాల్లో పర్యటించిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశాలు ఉన్నాయి. వయనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) పోటీ చేయాలన్న అభ్యర్థనను గాంధీ కుటుంబం తిరస్కరించినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతను వయనాడ్ నుంచి రంగంలోకి దింపాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వయనాడ్ నుంచి 3,64,422 ఓట్ల తేడాతో రాహుల్ గాంధీ గెలిచినా.. 2019 నాటి ఫలితాలతో పోలిస్తే సుమారు 67,348 ఓట్ల సంఖ్య తగ్గింది. వయనాడ్‌లో అన్నా రాజాను ఓడించగా, రాయ్‌బరేలీలో దినేశ్ ప్రతాప్ సింగ్‌పై 3,89,341 ఓట్లతో విక్టరీ కొట్టారు.