New Delhi, SEP 21: రైలు ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు (Train Accidents) కోల్పోయినా, గాయపడినా ఇచ్చే పరిహారాన్ని పదింతలు పెంచుతూ రైల్వేబోర్డు (Railway Board) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు నుంచే ఇవి అమల్లోకి వచ్చినట్లు లెక్క. 2013లో చివరిసారిగా ఈ మొత్తాలు పెంచారు. కాపలాదారులున్న లెవెల్‌క్రాసింగ్ (Level Crossing) గేట్ల వద్ద జరిగే ప్రమాదాలకూ ఇది వర్తిస్తుంది. రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ప్రస్తుతం రూ.50,000 చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.25,000 బదులు రూ.2.5 లక్షలు; స్వల్పగాయాలైనవారికి రూ.5,000 బదులు రూ.50,000 ఇస్తారు. అవాంఛిత ఘటనల విషయంలో ఈ పరిహారాలు వరసగా రూ.1.50 లక్షలు, రూ.50,000, రూ.5,000గా ఉంటాయి. ఉగ్రదాడులు, హింసాత్మక ఘటనలు, రైల్లో దోపిడీలు వంటివి అవాంఛిత ఘటనల కిందికి వస్తాయి.
రైలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినవారు 30 రోజులకు మించి ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి వస్తే రోజుకు రూ.3,000 వంతున ప్రతీ 10 రోజులకోసారి అదనపు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. అవాంఛిత ఘటనల్లోనైతే ఈ మొత్తం రూ.1,500గా ఉంటుంది. ఇలా ఆరు నెలలవరకు ఇస్తారు. ఆ తర్వాత రోజుకు రూ.750 చొప్పున గరిష్ఠంగా మరో అయిదు నెలలపాటు చెల్లిస్తారు. అయితే కాపలాదారుల్లేని లెవెల్‌క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలకు, రైల్వే నిబంధనలను అతిక్రమించినవారికి, రైలు మార్గాల విద్యుదీకరణ వ్యవస్థ (OHE) వల్ల విద్యుదాఘాతానికి గురైనవారికి ఎక్స్‌గ్రేషియా ( ex-gratia relief) లభించబోదని రైల్వేబోర్డు స్పష్టంచేసింది.