Rajasthan CM Ashok Gehlot (Photo Credits: ANI)

Jaipur November 20: రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మినహా కేబినెట్ మొత్తం రాజీనామా చేసింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ కోసం మంత్రివర్గం మొత్తం రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు నూతన మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేబినెట్ మంత్రుల నుంచి రాజీనామా పత్రాలను సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సేకరించారు.

తొలుత రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ దోతస్రా శుక్రవారమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రులంతా రాజీనామా చేయాలని మరో ఇద్దరితో కలిసి ఆయన ఒక ప్రతిపాదన చేశారు. దీంతో మంత్రులంతా రాజీనామా చేయాలని సీఎం గెహ్లాట్‌ కోరారు. శనివారం తన నివాసంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో మంత్రులంతా రాజీనామా చేశారని ప్రతాప్ ఖాచార్యవాస్ తెలిపారు. దీంతో ప్రభుత్వం రీ-ఫార్మేషన్‌కు సంబంధించి ఒక ప్రక్రియ పూర్తయిందన్నారు.

ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రాజస్థాన్‌ పీసీసీ మీటింగ్ నిర్వహించనున్నారు. కొత్త మంత్రులకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి లిస్ట్ కూడా వచ్చింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటూ, పార్టీని పటిష్టం చేయడం, అసంతృప్తులను బుజ్జగించడం కోసం మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది.