
Jaipur, Sep 19: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన మరదలను ఇచ్చి పెళ్లి చేయలేదని మనస్తాపానికి గురైన ఓ పెళ్లైన వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.తన నలుగురు కుమార్తెలను నీటి ట్యాంక్‌లో తోసేసి హత్య (Man dumps 4 daughters into water tank) చేశాడు. అనంతరం అతడు కూడా అందులోకి దూకి ఆత్మహత్యకు (attempts suicide) యత్నించాడు. మృతులంతా పదేళ్లలోపు పిల్లలే కావడం విషాదకరం. ఈ దుర్ఘటన రాజస్థాన్‌లోని బాడ్మేర్లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోశాల గ్రామానికి చెందిన పుర్ఖారామ్‌కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే కరోనా కారణంగా అతడి భార్య ఐదు నెలల క్రితం మృతిచెందారు. కుమార్తెలకు తల్లి అవసరం ఉందని భావించిన పుర్ఖారామ్.. మరదలు (భార్య చెల్లి)ని ఇచ్చి వివాహం చేయాలని అత్తామామలను కోరాడు. అందుకు వారు అంగీకరించలేదు. మనస్తాపానికి గురైన పుర్ఖారామ్.. కుమార్తెలు జియో (9), నోజి (7), హీనా (3), లాసి (ఏడాదిన్నర) చేత విషం తాగించాడు. అనంతరం వారిని తన ఇంటి ముందు 13 అడుగుల లోతున్న నీటి ట్యాంక్‌లో తోసేశాడు. తర్వాత పుర్ఖారామ్ కూడా అందులో దూకి ఆత్మహత్యకు యత్నించాడు.
అతడు వాటర్ ట్యాంక్‌లోకి దూకుతుండగా పొరుగింటివారు గమనించి పోలీసులకు సమాచారం అందించినట్లు పోలీసు అధికారి ఓం ప్రకాశ్ వెల్లడించారు. పోలీస్ అధికారం ఓం ప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. నలుగురు పిల్లలను నీటిలో తోసేయగా మునిగిపోయి వారు మరణించినట్లు తెలిపారు. మృతదేహాలను సమీపంలోని మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రాణాలతో బయటపడ్డ పుర్ఖారామ్‌ను జిల్లా ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు.