Yes Bank (Photo Credits: File Photo)

Mumbai, March 6: ఎస్ బ్యాంక్ (YES Bank) పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) ఆంక్షలు విధించింది. ఎస్ బ్యాంక్ నుంచి ఖాతాదారుల నగదు ఉపసంహరణలను గరిష్ఠంగా రూ. 50,000 కే పరిమితం చేసింది. అయితే మెడికల్ ఖర్చుల నిమిత్తం, లేదా ఎడ్యుకేషనల్ ఫీజు, వివాహాది శుభకార్యాలు తదితర "అనివార్యమైన అవసరాలు" ఉన్నపుడు రూ. 5 లక్షల వరకు నగదు ఉపసహంరించుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. దేశంలో 5వ అతిపెద్ద రుణదాతగా ఉన్న ప్రైవేట్ సెక్టార్ లోని ఎస్ బ్యాంక్ లో అవకతవకలు జరిగి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. దీంతో గత రాత్రే ఎస్ బ్యాంక్ ను తమ ఆధీనంలోకి తీసుకొని ఎస్ బ్యాంక్ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఏప్రిల్ 03 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఆ తరువాత ఎస్ బ్యాంక్ ను మారో బ్యాంక్ లో విలీనం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

కేంద్రీయ బ్యాంక్ (RBI) చర్యలతో ఎస్ బ్యాంక్ షేర్లు కుప్పకూలుతున్నాయి. శుక్రవారం ఉదయం 9:40 సమయానికి 24% పతనమైన ఎస్ బ్యాంక్ షేర్లు, ఉదయం 11:25 గంటల సమయానికి 54% పతనమై రూ. 16.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క ఎస్ బ్యాంక్ మాత్రమే కాదు, ఇదే క్రమంలో మిగతా అన్ని పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల షేర్లు పతనమవుతున్నాయి.

దీని ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,164 పాయింట్లు నష్టపోయి, 37,306 వద్ద, నిఫ్టీ 357 పాయింట్లు నష్టపోయి 10,911 వద్ద కొనసాగుతున్నాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 73.72 గా ఉంది.

Here's latest update by ANI

ఆర్బీఐ చర్యతో ఎస్ బ్యాంక్ యొక్క ఆన్ లైన్ లావాదేవీలు గురువారం సాయంత్రం నుంచి నిలిచిపోయాయి, ఏటీఎంలలో కూడా నిధులు ఖాళీ అయిపోయాయి. దీంతో ఖాతాదారుల్లో మరింత ఆందోళన నెలకొని డబ్బు విత్ డ్రా కోసం బ్యాంకుల వద్ద బారులు తీరారు.