Vaccine | Image used for representational purpose (Photo Credits: Twitter)

New Delhi, Sep 4: ముకేష్ అంబానీ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా (Covid Vaccine Update) తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌కు భారత డ్రగ్స్ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. రిలయన్స్ అభివృద్ధి చేసిన ఈ టీకాకు అనుమతి కోరుతూ గత నెల 26న నిపుణుల కమిటీకి దరఖాస్తు చేయగా పరిశీలించిన కమిటీ, అనుమతుల కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి (DCGI) సిఫార్సు చేసింది.

తాజాగా, నిన్న డీసీజీఐ తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో క్లినికల్ పరీక్షలకు రిలయన్స్ (Reliance Life Sciences) సిద్ధమైంది. మహారాష్ట్రలోని 8 చోట్ల ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్యవంతుల్లో ఈ టీకా భద్రత, రోగ నిరోధక స్పందనలు ఎలా ఉన్నాయన్నది ఈ పరీక్షల్లో తెలుసుకుంటారు. కమిటీ సిఫార్సుల మేరకు టీకాలు వేసిన 14వ రోజున కాకుండా 42వ రోజున టీకా తీసుకున్న వలంటీర్లలో రోగ నిరోధకశక్తి స్థాయులను తెలుసుకుంటారని రిలయన్స్ వర్గాలు తెలిపాయి.

దేశంలో కొత్తగా 42,618 మందికి కరోనా, 24 గంటల్లో 36,385 కోలుకుని డిశ్చార్జ్, తాజాగా 330 మంది మృతి, ప్రస్తుతం దేశంలో 4,05,681 యాక్టివ్‌ కేసులు

కాగా, హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ ఫార్మా సంస్థ కోర్బెవాక్స్ పేరిట 5 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారుల కోసం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు కూడా డీసీజీఐ తాజాగా అనుమతులు మంజూరు చేసింది.