
New Delhi, Sep 4: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం 45 వేలకుపైగా నమోదవగా, తాజాగా అవి 42 వేలకు పడిపోయాయి. ఇది నిన్నటికంటే 3.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొత్తగా 42,618 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,45,907కు చేరింది. ఇందులో 3,21,00,001 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,05,681 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,40,225 మంది బాధితులు మరణించారు.
శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 36,385 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 330 మంది మృతి ( 330 deaths in last 24 hours) చెందారని ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58 లక్ష మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. దేశంలో ఇప్పటివరకు 67,72,11,205 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో గత 24 గంటల్లో 58,85,687 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.
కరోనా వ్యాప్తికి సూచిక అయిన ఆర్-విలువ ఆగస్టు ద్వితీయార్ధంలో వేగంగా పెరిగింది. ఆగస్టు 14-17 మధ్యలో ఆర్-విలువ 0.89 ఉండగా అది ఆగస్టు 24-29 వరకు 1.17కు చేరింది. కేరళలో కేసుల పెరుగుదలే ఇందుకు కారణం అని వైద్య నిపుణులు తెలిపారు. కేరళలో ఆర్-విలువ అత్యధికంగా 1.33గా ఉంది. దేశవ్యాప్తంగా గురువారం కొత్తగా 45,352 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కేరళలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న కారణంగా అక్కడ ఈ నెల 6 నుంచి జరగాల్సిన 11వ తరగతి పరీక్షలను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.