Chennai Rains: మరోసారి నీటమునిగిన చెన్నై, రెడ్ అలర్ట్ జారీ, 48 గంటల పాటూ భారీ వర్షాలు కురిసే అవకాశం, ఒక్క రాత్రే 20 సెం.మీ వర్షపాతం నమోదు

Chennai November 07: చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రాత్రి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వచ్చే 48 గంటల్లోగా మహా వాయుగుండంగా తీవ్రరూపం దాల్చనుండడంతో ఈనెల 12 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది వాతావరణశాఖ.

శనివారం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు చెన్నైలోని పలుప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల మోకాళ్ల లోతు నీరు నిలిచింది. నిన్న ఒక్కరాత్రే 20 సెం.మీ కు పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

వాయుగుండం ప్రభావంతో కన్యాకుమారి, తూత్తుకుడి, విరుదునగర్‌, రామనాథపురం మదురై, పుదుకోట, శివగంగ తదితర డెల్టా జిల్లాలు, కడలూరు, విల్లుపురం, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువణ్ణామలై, తిరువళ్లూర్‌, కృష్ణగిరి, ధర్మపురి తదితర జిల్లాల్లో భారీ, మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆనకట్టలు, వాగులు, చెరువులు వేగంగా నిండుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇళ్లు నేలకొరిగాయి.

భారీ వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేసింది తమిళనాడు ప్రభుత్వం. జాలర్లు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో 11,12 తేదీల్లో గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఈ జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షాలు, రెడ్‌ అలర్ట్‌ నేపథ్యంలో సీఎం స్టాలిన్ శనివారం నుంచి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. మంత్రులు, రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ, ప్రజాపనుల శాఖల ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్‌, టెలిఫోన్‌ స్తంభాలను గుర్తించి తక్షణం తొలగించాలని, ప్రాణనష్టం జరుగకుండా జిల్లా యంత్రాంగం అన్ని శాఖలతో కలసి అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటిస్తున్నారు. చెన్నై శివారు ప్రాంతాల్లో కురుస్తున్న నీట మునిగిన కాలనీల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.