Mumbai, OCT 26: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) డెంగ్యూ (dengue) బారిన పడి చికిత్స పొందుతున్నారు. అయితే సల్మాన్ కు డెంగ్యూ ఫీవర్ రావడంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో కేసులు పెరుగకుండా చర్యలు చేపట్టింది ముంబై మున్సిపల్ కార్పొరేషన్. ముఖ్యంగా సల్మాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్లో ( Galaxy Apartments) బీఎంసీ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. డెంగ్యూకారక దోమలకు (mosquito) సంబంధించిన లార్వాను నాశనం చేశారు. రెండు ప్రాంతాల్లో డెంగ్యూకారక దోమల లార్వాను గుర్తించినట్లు బీఎంసీ సిబ్బంది (BMC) తెలిపింది. ఈ మేరకు ఫ్రీ ప్రెస్ జర్నల్ లో (Free Press Journal) కథనం వెలువడింది. అయితే సల్మాన్ ఖాన్ ఇంట్లో మాత్రం ఎలాంటి లార్వాను (Dengue Larvae) గుర్తించలేదని తెలిపారు.
గెలాక్సీ అపార్ట్ మెంట్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన బీఎంసీ ప్రత్యేక బృందం లార్వా పెరిగేందుకు కారణమయ్యే ప్రాంతాలను గుర్తించి వాటిని శుభ్రం చేసింది. అంతేకాదు యాంటీ లార్వా లిక్విడ్స్ ను చల్లింది. అయితే రెండు ప్రాంతాల్లో లార్వా దొరకడంతో అపార్ట్‌మెంట్‌లో కలకలం రేగింది. అపరిశుభ్రత పాటించినందుకు ఆ రెండు ఫ్లాట్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది బీఎంసీ. సల్మాన్ ఇంట్లో ఎలాంటి లార్వా లభించకపోవడంతో ఆయనకు చిక్కులు తప్పినట్లే.
గత నాలుగు రోజులుగా సల్మాన్ డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. డెంగ్యూకారక దోమల వ్యాప్తిపై ప్రజల్లో ఇప్పటికే బీఎంసీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అనధికారికంగా ఫౌంటేన్లు నిర్మించిన వారిని గుర్తిస్తున్నారు. వీటితో పాటూ లార్వా నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తిస్తూ వాటిని నిర్మూలిస్తున్నారు.