School | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, JAN 07:  ఉత్త‌రాదిన ముఖ్యంగా దేశ రాజ‌ధాని ఢిల్లీని చ‌లిగాలులు (Cold Wave)వ‌ణికిస్తున్నాయి. ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోవ‌డంతో జ‌నం ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావాలంటేనే వ‌ణికిపోతున్న ప‌రిస్ధితి. ఇక చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణం కార‌ణంగా న‌ర్స‌రీ నుంచి 5వ త‌ర‌గ‌తి వ‌ర‌కూ రానున్న అయిదురోజులు స్కూల్స్‌ను (Schools Shut) మూసివేస్తున్న‌ట్టు ఢిల్లీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, ప్ర‌భుత్వ ఎయిడెడ్ పాఠ‌శాల‌ల‌తో పాటు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌కు జ‌న‌వ‌రి 12 వ‌ర‌కూ సెల‌వ‌లు ప్ర‌కటించామ‌ని విద్యాశాఖ మంత్రి అతిషి ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు.

 

న‌ర్స‌రీ నుంచి 5వ త‌ర‌గ‌తి విద్యార్ధులకు చ‌లి వాతావ‌ర‌ణం కార‌ణంగా రాబోయే ఐదు రోజులు ఢిల్లీలో స్కూల్స్ మూసివేస్తున్న‌ట్టు అతిషి పేర్కొన్నారు. జ‌న‌వ‌రి 15న ప్రాధ‌మిక త‌ర‌గ‌తుల విద్యార్ధులు తిరిగి స్కూల్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ విద్యా ధాఖ డైరెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. స్కూల్స్ త‌మ విద్యార్ధుల‌కు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వ‌హించ‌వ‌చ్చ‌ని ఉత్త‌ర్వులు వెల్ల‌డించాయి.

 

చ‌లి వాతావ‌ర‌ణం దృష్ట్యా పాఠ‌శాల‌లు ఉద‌యం 8 గంట‌ల‌కు ముందు ప్రారంభం కావ‌ని, సాయంత్రం 5 గంట‌ల త‌ర్వాత త‌ర‌గతులు నిర్వ‌హించ‌ర‌ని ఉత్త‌ర్వులు స్ప‌ష్టం చేశాయి. అటు ఢిల్లీతో పాటూ పంజాబ్ లో కూడా కోల్డ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంది. దీంతో అక్కడి ప్రభుత్వం కూడా స్కూళ్లకు సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.