Dantewada, JAN 31: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు (Maoist) చేస్తున్న కార్యకలాపాల్లో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా మావోయిస్టులు ఏకంగా సొరంగాలనే (Tunnels) ఏర్పాటు చేసుకున్న విషయం బయటపడింది. మావోయిస్టులు ఏర్పాటుచేసుకున్న సొరంగాలను మంగళవారం గుర్తించిన పోలీసులు.. వాటి ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సొరంగాలు ఉన్న ప్రాంతం దండకారణ్యంలోని దంతెవాడ అని ప్రాథమికంగా తెలుస్తున్నది. అది ఏ ప్రాంతమో అక్కడి పోలీస్ అధికారులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉన్నది.
#WATCH | Chhattisgarh: Visuals from a tunnel dug by Naxalites to be used as a bunker, in Dantewada.
(Source: Dantewada Police) pic.twitter.com/04gRKCtWYl
— ANI (@ANI) January 31, 2024
ఒక్కో సొరంగం కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్నట్లు సమాచారం. ఒక్కో సొరంగ మార్గం ఒక మనిషి నడిచి వెళ్లేందుకు వీలుగా ఉన్నదని, సొరంగంలో కొన్నిచోట్ల బయట నుంచి గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు ఉన్నట్లు వైరల్ అయిన వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక్క దంతెవాడ ప్రాంతంలోనే కాక ఛత్తీస్‌గఢ్‌లోని ఇతర మావోయిస్టు ప్రభావిత జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లోనూ సొరంగాలు ఉన్నట్లు అక్కడి పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.