Sensex Slumps Over 1,150 Points: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, ఒక్కరోజులోనే రూ. 4.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి, మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి ప్రభావం
Stock Market (Photo credits: PTI)

Mumbai Octorber 28: దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) రక్తమోడాయి. బుధవారం నాడు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, గురువారం కూడా అదే బాటలో పయనించాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 11 వందల పాయింట్లకు పైగా పతనమయ్యింది. దీంతో సెన్సెక్స్(Sensex) 60వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 18 వేల మార్క్‌ దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్లను భారీగా దెబ్బతీశాయి. అటు పలు రంగాలకు చెందిన షేర్లపై తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపడంతో భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో…గురువారం నాటి ట్రేడింగ్‌లో దాదాపు రూ.4.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. 61వేల 81 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్‌, ఒక దశలో 1200 పాయింట్లకు పైగా పతనమై 59 వేల 777 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1,159 పాయింట్లు పడిపోయి 59 వేల 984 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 17వేల 799 నుంచి 18వేల 190 పాయింట్ల మద్య ట్రేడింగ్ కొనసాగింది. చివరకు 353 పాయింట్ల నష్టంతో 17వేల 857 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, రియల్టీ, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌, ఫార్మా రంగాల షేర్లు 2 నుంచి 5శాతం మేర నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1శాతం మేర పడిపోయాయి. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 3.34 శాతం నష్టపోయింది.

ఇటీవల పలు కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. అయితే అందులో చాలా కంపెనీలు దలాల్ స్ట్రీట్ అంచనాలను అందుకోలేకపోయాయి. ఇది ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, అదానీపోర్ట్స్ వంటి దిగ్గజ షేర్లలో లాభాల స్వీకరణ మార్కెట్లను దెబ్బతీసింది. గత రెండు వారాల్లో దేశీయ మార్కెట్లు రికార్డు లాభాలతో పరుగులు తీశాయి. దీంతో ఈ వారం ఆరంభం నుంచే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ ప్రారంభించారు. వారితో పాటూ దేశీయ ఇన్వెస్టర్లు కూడా అమ్మకాలకు మొగ్గుచూపారు. దీనికి తోడు అక్టోబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడంతో ఆ సెటిల్మెంట్ వాల్యూ కోసం అమ్మకాలు పెరిగాయి, ఇది కూడా మార్కెట్లను దెబ్బతీసింది.