Bhopal, JAN 13: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో (Bhopal) దారుణం జరిగింది. ఏడు నెలల చిన్నారిని వీధి కుక్కలు (Stray Dogs) అత్యంత కిరాతకంగా కొరికి చంపాయి. భోపాల్ నగరంలోని అయోధ్య నగర్ ఏరియాలో బుధవారం ఈ ఘటన జరిగింది. అదే రోజు కుటుంబసభ్యులు చిన్నారిని ఖననం చేశారు. కానీ, వీధి కుక్కలు బాలుడిపై దాడి చేస్తున్న (Boy Mauled To Death) వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భోపాల్ పోలీసులు, అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించారు. వివరాల్లోకి వెళ్తే.. గుణ జిల్లాకు చెందిన కుటుంబం బతుకుదెరువు కోసం భోపాల్‌లోని అయోధ్యనగర్‌కు వచ్చి నివాసం ఉంటోంది. భర్త, భార్య ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం తల్లి తన ఏడు నెలల కొడుకును నేలపై పడుకోబట్టి పనిలో నిమగ్నమైంది. అటుగా వచ్చిన వీధి కుక్కలు బాలుడిని ఎత్తుకెళ్లి కరిచి చంపాయి. ఒక చేతిని శరీరం నుంచి వేరుచేశాయి.
స్థానికులు గమనించి కుక్కలను తరిమేశారు. కానీ, అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం కుటుంబసభ్యులు బాలుడిని సమాధి చేశారు. అయితే వీధి కుక్కల దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో భోపాల్ అధికారులు, పోలీసులు ఘటనపై దృష్టిపెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. మృతుడి పేరెంట్స్‌కు భోపాల్ నగరపాలక శాఖ నుంచి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. త్వరలో మరో రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు.