Maharashtra Politics: మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో ట్విస్ట్, షిండే, ఫ‌డ్న‌వీస్, అజిత్ ప‌వార్ ల‌ను విందుకు పిలిచిన శ‌ర‌ద్ ప‌వార్
Sharad-Pawar

Mumbai, FEB 29: మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన ప్రత్యర్థులైన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde), ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్‌(Devendra Fadavis), అజిత్‌ పవార్‌లను ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్‌) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతోపాటు ఎన్సీపీ (NCP)ని చీల్చి, బీజేపీ-షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరిన అజిత్‌తో విభేదాలు కొనసాగుతోన్న వేళ ఈ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది. మార్చి 2న పుణె జిల్లాలోని బారామతిలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళా ప్రారంభోత్సవానికి షిండే, ఫడణవీస్‌, అజిత్‌లు హాజరుకానున్నారు. శరద్‌ పవార్‌ రాజ్యసభ ఎంపీ కాగా, బారామతి పార్లమెంటు స్థానం నుంచి ఆయన కుమార్తె సుప్రియ సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

ఎంపీ హోదాలో తామిద్దరం ఈ అధికారిక కార్యక్రమంలో భాగమవుతామని శరద్‌ పవార్‌ ఓ లేఖలో తెలిపారు. కార్యక్రమం అనంతరం తన నివాసమైన ‘గోవింద్‌బాగ్‌’లో భోజనానికి రావాల్సిందిగా ముగ్గురు నేతలకు ఆహ్వానం పంపారు. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ‘ఎన్సీపీ’గా గుర్తించిన ఎన్నికల సంఘం.. ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తును కూడా వారికే కేటాయించిన విషయం తెలిసిందే. దీన్ని శరద్‌ పవార్‌ తీవ్రంగా తప్పుపట్టారు. మరోవైపు.. బారామతి నుంచి అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్ర పవార్‌ కూడా పోటీచేసే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య శరద్‌ ‘విందు’ ఆహ్వానం రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీసింది.