New Delhi, Sep 13: బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమ కట్టడాల పేరుతో ప్రజల ఇండ్లపైకి ప్రభుత్వాలు బుల్డోజర్లను పంపిస్తుండటాన్నిసర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది.గురువారం (సెప్టెంబర్ 12, 2024) సుప్రీం కోర్ట్ ఒక నేరంలో ఆరోపించిన వ్యక్తి ప్రమేయం.. అతని లేదా ఆమె ఆస్తిని కూల్చివేయడానికి కారణం కాదని పేర్కొంది.
భూ చట్టాలపై అధికారులు బుల్‌డోజర్‌ను నడపలేరని జస్టిస్ హృషికేష్ రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.క్రిమినల్ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉండటం ఆ నిందితుల ఇండ్ల కూల్చివేతకు తగిన కారణం కాబోదని స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలను దేశ చట్టాలను తుంగలో తొక్కడంగా పరిగణించవచ్చునని హెచ్చరించింది.
గుజరాత్‌లోని ఖేదా జిల్లాకు చెందిన జావేద్ అలీ మెహబూబామియా సయీద్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం గురువారం ఈ హెచ్చరిక చేసింది. సయీద్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కఠ్లాల్ గ్రామ రెవిన్యూ రికార్డుల ప్రకారం తన క్లయింటు ఓ భూమికి సహ యజమాని అని చెప్పారు. ఆ భూమిలో ఇంటిని నిర్మించుకోవడానికి గ్రామ పంచాయతీ 2004లో అనుమతి ఇచ్చిందన్నారు. 20 ఏళ్ల నుంచి మూడు తరాలు ఆ ఇంటిలో నివసిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఈ నెల 2న జారీ చేసిన ఇండ్ల కూల్చివేత కోసం అనుసరించవలసిన మార్గదర్శకాలను కూడా అందులో ప్రస్తావించారు.
ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు స్పందిస్తూ, ప్రభుత్వాల చర్యలు చట్టాలకు అనుగుణంగా ఉండవలసిన దేశంలో, ఓ కుటుంబంలోని ఓ వ్యక్తి ఏదైనా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండటాన్ని కారణంగా చూపించి, ఆ కుటుంబంలోని ఇతర వ్యక్తులకు, వారు చట్టబద్ధంగా నిర్మించుకున్న ఇంటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. నేరంలో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఆ నిందితుని ఇంటిని కూల్చివేయడానికి తగిన కారణం కాబోవని వివరించింది.
సయీద్‌పై కేసు న్యాయస్థానంలో రుజువు కావలసి ఉందని తెలిపింది. చట్టాలే అత్యత్తమమని భావించే దేశంలో ఇటువంటి కూల్చివేత బెదిరింపులను చూసీచూడనట్లు కోర్టులు ఉండటం సాధ్యం కాదని చెప్పింది. ఇటువంటి చర్యలను చట్టాలపైకి బుల్డోజర్లను తోలడంగా పరిగణించవచ్చునని తెలిపింది. సయీద్ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని గుజరాత్ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. పిటిషనర్ ఆస్తికి సంబంధించి యథాతథ స్థితిని సంబంధిత వారందరూ కొనసాగించాలి" అని కూడా కోర్టు ఆదేశించింది.