New Delhi, DEC 16: విద్యుత్ చౌర్యం (electricity theft ), హత్య.. రెండూ ఒక్కటి కాదని వ్యాఖ్యానించింది భారత సుప్రీంకోర్టు (Supreme Court). విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డందుకుగాను ఒక వ్యక్తికి విధించిన 18 ఏళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు (Supreme Court) చేసింది. ఇది సరైన న్యాయం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇక్రమ్ అనే వ్యక్తి రెండేళ్లపాటు విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డాడు. 2018లో ఇది గుర్తించిన యూపీ విద్యుత్ శాఖ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం 2019లో అతడ్ని అరెస్టు చేశారు. అప్పట్నుంచి జైల్లోనే ఉంటున్నాడు. విద్యుత్ చౌర్యానికి (electricity theft ) సంబంధించి ఇక్రమ్‌పై ప్రభుత్వం 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. వీటిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు అతడికి 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2020లో ఈ తీర్పు వెలువరించింది. దీంతో బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన కేసులు కొట్టివేసి, విడుదల చేయాలని కోరాడు. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు బాధితుడిని విడుదల చేయాలని ఆదేశించింది.
అయితే, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని యూపీ ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించాడు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ చౌర్యం చేయడం, హత్య చేయడం ఒక్కటి కాదని.. విద్యుత్ చౌర్యానికి 18 ఏళ్ల జైలు శిక్ష విధించడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడు ఇప్పటికే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించినందున వెంటనే అతడ్ని విడుదల చేయాలని ఆదేశించింది.
యూపీలో విద్యుత్ చౌర్యానికి పాల్పడితే సెక్షన్ 136 ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం గరిష్టంగా ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అయితే, ఇక్రమ్‌పై ఇతర అనుబంధ కేసులు కూడా నమోదు చేయడంతో అతడి శిక్ష 18 ఏళ్లకు పెరిగింది. తాజాగా సుప్రీం ఆదేశాలతో బాధితుడు జైలు నుంచి విడుదల కానున్నాడు.