New Delhi, February 10: షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (దురాగతాల నివారణ) సవరణ చట్టం, 2018 (SC/ST (Prevention of Atrocities) Amendment Act 2018) యొక్క రాజ్యాంగబద్ధమైన ప్రామాణికతను సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం సమర్థించింది.
తాజా తీర్పు ప్రకారం, ఎస్సీ / ఎస్టీలపై దారుణానికి పాల్పడిన నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా ఈ చట్టం అంగీకరించదు. ఈ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎలాంటి ప్రాథమిక విచారణ అవసరం లేదు, సీనియర్ పోలీసు అధికారుల అనుమతి కూడా అవసరం లేకుండానే నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేయవచ్చునని సుప్రీం స్పష్టం చేసింది. అయితే, అసాధారణమైన పరిస్థితులలో కోర్టులు ఎఫ్ఐఆర్లను రద్దు చేయవచ్చు అని పేర్కొంది.
ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటీ చట్టంను కొంతమంది ఇది తమకు లభించిన అస్త్రంగా భావిస్తూ ప్రభుత్వ అధికారులపై లేదా ఇతర వ్యక్తులు లేదా గిట్టని వారిపై లక్ష్యంగా చేసుకొని ఈ చట్టంను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో మార్చి 20, 2018లో సుప్రీంకోర్ట్ ఈ చట్టంలో కొన్ని సవరణలు సూచించింది. అట్రాసిటీ కేసు నమోదైనపుడు నిందితుల అరెస్టుకు ముందు ప్రాథమిక విచారణకు అనుమతిని ఇవ్వడంతో పాటు, నిందితులు ముందస్తు బెయిల్ పొందేందుకూ అవకాశం కల్పించింది.
దీంతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేశారంటూ ఆ వర్గం వారు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్ట్ మార్చి 20, 2018న ఇచ్చిన ఉత్తర్వులను పున: సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అలాగే ఈ చట్టం యొక్క రాజ్యాంగ ప్రామాణికతను సవాల్ చేస్తూ అగ్రవర్ణాల సంఘాలు ఈ అట్రాసిటీ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి.
అన్ని పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఈ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లన్నింటినీ కొట్టివేస్తూ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత పటిష్ఠపరుస్తూ తీర్పునిచ్చింది.