Swati Maliwal (File Image)

New Delhi, May 02: దేశ రాజధానిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మహిళా కమిషన్‌ (Delhi Commission for Women)లో 223 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఎల్జీ (Delhi LG) కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ నిబంధనలను ఉల్లంఘించి మరీ వీరిని నియమించారని అందులో ఆరోపించారు. ‘‘చట్ట ప్రకారం ఢిల్లీ మహిళా కమిషన్‌లో 40 పోస్టులను మాత్రమే కేటాయించారు. కానీ, మాజీ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 223 కొత్త ఉద్యోగాలను సృష్టించారు. కాంట్రాక్టు ఉద్యోగుల కింద వీరిని నియమించుకున్నారు. అయితే, ఒప్పంద నియామకాలు చేపట్టేందుకు కమిషన్‌కు అధికారం లేదు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వంపై అదనపు భారం మోపే నిర్ణయాలను కమిషన్‌ తీసుకోకూడదు’’ అని ఎల్జీ కార్యాలయం తన ఉత్తర్వుల్లో వెల్లడించింది.

 

ఇక కమిషన్‌ సిబ్బంది వేతనాలు, భత్యాల పెంపు విషయంలోనూ మార్గదర్శకాలను ఉల్లంఘించారని దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది. చట్ట విరుద్ధంగా విధుల్లోకి తీసుకున్న ఆ 223 మంది ఉద్యోగులను తక్షణమే తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా 9 ఏళ్ల పాటు స్వాతి మాలివాల్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది జనవరిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆమెను రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ఆ తర్వాత నుంచి కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవి ఖాళీగా ఉంది.

 

ఈ ఉత్తర్వులను స్వాతి మాలివాల్‌ సోషల్‌ మీడియా వేదికగా ఖండించారు. ‘‘ఒప్పంద ఉద్యోగులను తొలగిస్తే మహిళా కమిషన్‌ను మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఈ సంస్థను ఏర్పాటు చేసుకోగలిగాం. అలాంటి కమిషన్‌కు సిబ్బందిని ఇచ్చి రక్షణ కల్పించాల్సింది పోయి.. దాన్ని సమూలంగా నాశనం చేయాలని చూస్తున్నారు. నేను బతికి ఉన్నంతవరకు అలా జరగనివ్వను. కావాలంటే నన్ను జైల్లో పెట్టండి.. మహిళలను వేధించొద్దు’’ అని ఆమె రాసుకొచ్చారు. కాగా.. గత కొన్ని రోజులుగా ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మధ్య పాలన విషయంలో విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యవహారాలను ఎల్జీ ఆఫీస్‌ అడ్డుకుంటోందని ఆప్‌ సర్కారు ఆరోపించింది.