కన్యాకుమారి, మార్చి 16: పాఠాలు చెప్పాల్సిన ఆచార్యుడే చదువుకోటానికి వచ్చిన విద్యార్ధినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై కన్యాకుమారి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాసుదేవన్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్ధినులకు అభ్యంతరకర అసభ్యకర మెసేజ్‌లు, వీడియోలు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. 22 ఏళ్ల విద్యార్ధిని వాసుదేవన్ పై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఆచార్యుడి బాగోతం వెలుగులోకి వచ్చింది.
విద్యార్ధిని ఫిర్యాదు చేసినా కాలేజీ యాజమాన్యం ప్రొఫెసర్ పై ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో విద్యార్ధులు తరగతులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. వాసుదేవన్ ను విధులనుంచి తొలగించాలని… అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్ధినుల నిరసనలతో అక్కడకు చేరుకున్న పోలీసులు వాసుదేవన్‌పై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చి విద్యార్దినుల నిరసనను విరమింప చేశారు. విద్యార్ధినులను ప్రొఫెసర్ పలుమార్లు లైంగిక వేధింపులకు గురి చేసినా కాలేజ్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.
వాసుదేవన్ ద్వందార్ధాలతో కూడిన మెసేజ్‌లు, అశ్లీల వీడియోలను తనకు పంపాడని ఓ విద్యార్ధిని తెలిపింది. ఈ విషయం ఆమె తన సోదరుడికి తెలపడంతో అతడు ప్రొఫెసర్‌ను నిలదీశాడు. అధికారులు వాసుదేవన్‌పై ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో విద్యార్ధులు నిరసనలకు దిగారు. విద్యార్ధినుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు వాసుదేవన్‌పై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు.
కాగా లైంగిక వేధింపుల ఆరోపణలను అసిస్టెంట్ ప్రోఫెసర్ తోసిపుచ్చాడు. విద్యార్ధిని సోదరుడు తనపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్ధిని సోదరుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.