Lucknow, April 10: ఒక వ్యక్తి థ్రిల్ కోసం తన స్నేహితురాలికి డ్రగ్స్ ఇంజెక్ట్ (Injected Drugs) చేశాడు. అయితే డ్రగ్స్ ఓవర్ డోస్ వల్ల ఆ యువతి మరణించింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Teen Dies of Drugs Overdose) ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ సంఘటన జరిగింది. మహానగర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి బెంగళూరులో జాబ్ చేస్తున్నది. ఈ నెల 3న లక్నోకు తిరిగి వచ్చింది. ఏప్రిల్ 7న రైలులో బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రయాణం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె తన స్నేహితుడైన 28 ఏళ్ల వివేక్‌కు ఫోన్ చేసింది. కాగా, థ్రిల్స్ కోసం డ్రగ్స్ తీసుకోవాలని వారిద్దరూ భావించారు. దీంతో తివారిగంజ్‌లోని స్నేహితుడి ఖాళీ ప్లాట్‌కు ఆమెను తీసుకెళ్లాడు. వివేక్ తొలుత డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకున్నాడు.
తర్వాత ఆమెకు కూడా డ్రగ్స్ ఇంజెక్ట్ చేశాడు. అయితే మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడంతో ఆ యువతి అస్వస్థతకు గురైంది. దీంతో అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్లు ఆమె మరణించినట్లు చెప్పారు. యువతి పరిస్థితి గురించి ఆమె తల్లికి సమాచారం ఇచ్చిన వివేక్ భయంతో ఆసుపత్రి నుంచి పారిపోయాడు. మరోవైపు కుమార్తె మృతిపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను చంపేందుకు వివేక్ ఎక్కువ డ్రగ్స్ ఇచ్చాడని ఆరోపించింది. గతంలో వివేక్‌కు చెందిన బిల్డింగ్‌లోని ఇంట్లో తాము అద్దెకు ఉన్నప్పుడు అతడితో పరిచయం ఏర్పడినట్లు పోలీసులకు చెప్పింది. వివేక్ కోసం వెతికిన పోలీసులు చివరకు అతడ్ని అరెస్ట్ చేశారు. ప్రశ్నించిన తర్వాత పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.