New Delhi, January 17: టెలికాం సర్వీసు ప్రొవైడర్లు ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా మరియు టాటా టెలీసర్వీసెస్ మొదలగునవి (Telecom Companies) ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో బకాయి పడ్డాయి. సుమారు రూ. 92 వేల కోట్ల బకాయిలు ఉండగా, వాటికి వడ్డీ, అపరాధ రుసుం ఇతర ఛార్జీలన్నీ కలిపి బకాయిలు రూ. లక్ష కోట్లు దాటాయి. ఈ సవరించిన గ్రాస్ రెవెన్యూ ( AGR) మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు సుప్రీంకోర్ట్ (Supreme Court) గత అక్టోబర్ నెల 24వ తేదీనే కేంద్ర ప్రభుత్వానికి అనుమతులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
అయితే ఏజిఆర్ తీర్పును పున:సమీక్షించాలంటూ వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ మరియు టాటా టెలిసర్వీస్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. ప్రస్తుతం టెలికాం పరిశ్రమ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సుప్రీం తీర్పు టెలికాం రంగాన్ని మరింత కుంటుపడేలా చేస్తుంది.
దేశంలో నెట్‌వర్క్‌లను విస్తరించడం, స్పెక్ట్రం సంపాదించడం మరియు 5జి వంటి కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంత మొత్తంలో బకాయిలపై వడ్డీ, జరిమానాలు మరియు జరిమానాలపై కూడా వడ్డీకి చెల్లించే మొత్తం దేశంలోని 'డిజిటల్ మిషన్' కు ఉపయోగిస్తాం కాబట్టి వీటి నుంచి మినహాయింపును ఇవ్వాలని ఎయిర్ టెల్ కోరింది.
అయితే, సుప్రీంకోర్ట్ మాత్రం పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. AGR పై గతంలో ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీం తేల్చి చెప్పింది. AGR బకాయిలు చెల్లించేందుకు టెలికాం ప్రొవైడర్లకు ఇప్పటికే ఇచ్చిన 3 నెలల గడువు ముగియడంతో, వారం రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని సర్వీస్ ప్రొవైడర్లకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం ఆదేశాలు వోడాఫోన్ ఐడియా (Vodafone Idea) మరియు ఎయిర్‌టెల్ (Bharti Airtel ) సంస్థలకు శరాఘాతంలా పరిణమించాయి. ఎయిర్‌టెల్ రూ. 53,039 కోట్లు బకాయి పడింది, వోడాఫోన్ ఐడియా రూ .35,586 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్ రూ. 13,823 కోట్లు బకాయిలు కలిగి ఉన్నాయి. సుమారు 15 కంపెనీలు కలిపి కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.47 లక్షల కోట్లకు పైగా చెల్లించాలి. ఇవి ఈ మొత్తాన్ని సుప్రీం ఆదేశాల మేరకు జనవరి 23లోగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్, ఇతర కంపెనీలు ఇక చేసేదేం లేక 'కొంచెం తగ్గించండని' కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని యోచిస్తుంది.