Nallamala, September 14: దట్టమైన అభయారణ్యాలు.. అరుదైన జంతు జాతులు.. లెక్కలేనన్ని క్రూర మృగాలు.. బోలెడన్ని పులులు.. ఎటుచూసినా కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు.. ఇలా ప్రకృతి సంపదకు పెట్టింది పేరైన నల్లమల అడవుల్లో ఇప్పుడు యురేనియం అగ్గి రాజుకుంటోంది. దక్షిణ భారత దేశానికే తలమానికంగా ఉన్న నల్లమల అడవులపై కేంద్రం కన్ను పడటంతో ఆ అడవులు ఇప్పుడు ప్రమాదంలో పడబోతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుడు సేవ్ నల్లమల ( SAVE NALLAMALA ) ఉద్యమాన్ని లేవదీశారు. ఇంతకీ కేంద్రం అక్కడ ఏం చేయబోతుంది ఓ సారి చూద్దాం.
ఏపీ, తెలంగాణలోని కర్నూలు, మహబూబ్‌నగర్, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో యురేనియం ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిక్షేపాలను గుర్తించేందుకు సర్వేకు అనుమతి ఇచ్చింది. నల్లమల అడవిలోని కుంచోని మూల నుంచి పదర వరకు మొదటి బ్లాక్‌లో 38 చదరపు కిలో మీటర్లు, పదర నుంచి ఉడిమిల్ల వరకు రెండో బ్లాకులో 38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగు వేల బోర్లు వేసి, నమూనాలు సేకరించేందుకు భారత అణుశక్తి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు అనుమతులు రావడంతో అచ్చంపేట, అమ్రాబాద్ అటవీశాఖ అధికారులు, సిబ్బంది కలిసి వారం రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. డ్రిల్లింగ్యంత్రాలు తీసుకు వచ్చేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విపక్ష నేతలు దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని లేవదీశారు. నల్లమల అడవుల్లో నివాసం ఉంటున్న చెంచులకు దీని పరిణామాల మీద స్థానికులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరూ ఇప్పుడు ఏకమై తమ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు అక్కడ ఉద్యమం వైపు అడుగులు వేస్తున్నారు. బృందాలుగా రోడ్లపైకి వచ్చి రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. నల్లమలను ఏ విధంగా కాపాడుకోవాలో తమకు తెలుసని, ఊరికే చేతులు కట్టుకొని ఉండబోమని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఊపందుకున్న ఉద్యమం:
సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ప్రముఖులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇతర రంగాలవారు స్పందిస్తుండడంతో #SaveNallamala పేరిట ఉద్యమం సోషల్ మీడియాలో ఉపందుకుంది. సోషల్ మీడియాలో ప్రారంభమైన సేవ్ నల్లమల ఉద్యమానికి సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నటుడు విజయ్ దేవరకొండ, సమంత సాయి ధరమ్ తేజ్, అనసూయ, సమంత, రామ్ సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపారు.ఇప్పటికే దర్శకుడు శేఖర్ కమ్ముల సేవ్ నల్లమల అంటూ సపోర్ట్ తెలియజేసారు.
Vijay Devarakonda Tweet:
ట్విట్టర్ లో ట్రెండ్
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రముఖులు ప్రచారం నిర్వహిస్తుండటంతో.. ‘సేవ్ నల్లమల’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ట్విట్టర్ లో దీనిపై స్పందించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల వ్యవహారంలో అందరి ఆవేదనను తాను చూస్తున్నానని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి వ్యక్తిగతంగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
KTR Tweet:
I hear all of your concern on the issue of uranium mining in Nallamala forest. Assure you all that i shall personally discuss the matter with Hon’ble CM KCR Garu
— KTR (@KTRTRS) September 13, 2019
శుక్రవారం ఒక్కరోజే 45 వేల ట్వీట్లతో దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. సినీనటులు పవన్‌కల్యాణ్, విజయ్ దేవరకొండ, సమంత తదితరులు చేసిన పోస్టింగ్‌లను నెటిజన్లు ఎక్కువగా రీట్వీట్ చేస్తున్నారు. ‘స్టాప్ యురేనియం మైనింగ్’ అనే మరో హ్యాష్‌ట్యాగ్ 15 వేల ట్వీట్లతో పదో స్థానంలో ఉంది.
Change.Orgలో మొదలైన ఆన్‌లైన్ పిటిషన్:
ఈ నేపథ్యంలో నల్లమల అడవులను యురేనియం బారి నుంచి కాపాడాలని ఛేంజ్.ఆర్గ్‌లో మొదలైన ఆన్‌లైన్ పిటిషన్‌ను సమంత షేర్ చేశారు. ఈ పిటీషన్‌పై సంతకం చేశాను. మరి మీరు? అని ఆమె ట్వీట్ చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను చేపట్టొద్దని కోరుతూ.. Dyfi Telangana పేరిట ఆన్‌లైన్ పిటీషన్‌ను రూపొందించారు. ఈ తవ్వకాల వల్ల ఏపీ, తెలంగాణల్లో భారీగా అడవులు నరికివేతకు గురవుతాయని పిటీషనర్ వాపోయారు. అటవీ భూమి అణుధార్మికత ప్రభావానికి గురైతే.. మొక్కలు పెరగవని, ఈ భూమంతా బీడుగా మారుతుందని పిటీషనర్ తెలిపారు. శ్రీశైలం-నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్‌పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. 20,500 ఎకరాల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు టైగర్ రిజర్వ్‌ను దెబ్బతీస్తుందని.. జీవవైవిధ్యానికి నష్టం వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ పిటిషన్‌పై ఇప్పటికే 10 వేల మందికిపైగా సంతకాలు చేశారు.
కేంద్రం లక్ష్యమిదే..
2030 నాటికి అణు విద్యత్తు ఉత్పత్తి 40వేల మెగావాట్లకు చేరాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లు భారత అటామిక్ ఎనర్జీ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. యురేనియం నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలని స్పష్టం చేసింది. దీంతో హై గ్రేడ్, దీర్ఘకాలం పాటు దొరికే యురేనియం నిక్షేపాల కోసం వెతగ్గా.. నల్లమల అడవుల్లో దొరుకుతున్నట్లు తెలిసింది. వెంటనే ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీకి నివేదించగా.. ఆ కమిటీ ఆందోళన వ్యక్తం చేసినా, జాతి ప్రయోజనాల దృష్ట్యా యురేనియం తవ్వకాలు అత్యవసరం’ అని ప్రాజెక్టుకు అప్రూవల్ ఇచ్చారు.
సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ నల్లమలను రక్షించుకుందామంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఉధృతమవుతున్న సేవ్ నల్లమల ఉద్యమం... త్వరలో ప్రత్యక్ష పోరాటాలకు దారి తీయడం ఖాయమనే సంకేతాల్ని పంపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.