Homeless Man's Funeral: ఓ యాచకుడి మరణంతో ఆ నగరమంతా కన్నీటిపర్యంతమైంది, కర్ణాటకలో యాచకుడికి దక్కిన ఘనమైన కడసారి వీడ్కోలు

Bengaluru November 19: అది కర్ణాటకలోని హడగళ్లి పట్టణం, ఆదివారం సాయంత్రం పూట ఏ కూడలి చూసినా ఒక వ్యక్తి ఫోటో కనిపిస్తోంది. ఓ అంతిమ యాత్ర వెనుక వేలాది మంది అనుసరిస్తున్నారు. అలాగని అతను రాజకీయ నాయకుడు కాదు, సినిమా హీరో కాదు, స్వామీజీ అంతకన్నా కాదు. కానీ సామాన్యుల నుంచి బడా వ్యాపారుల వరకు అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. అతను లేడని తెలుసుకొని కన్నీరు కార్చారు. అతని పేరు హచ్చబస్య. హడగళ్లి పట్టణ ప్రజలకు సుపరిచితుడు.

ఎవరూ లేని హచ్చబస్య…ఆ ఊరిలో అందరూ తనవారే అనుకొని యాచిస్తూ జీవిస్తున్నాడు. ఈ యాచ‌కుడు హ‌డ‌గ‌ళ్లి ప‌ట్టణ ప్రజ‌ల‌కు ఎంతో సుప‌రిచితుడు. బ‌స‌వ‌ను స్థానికులంతా అదృష్టవంతుడిగా భావిస్తుంటారు. అత‌నికి ఒక రూపాయి ఇచ్చి వెళ్తే మంచి జ‌రుగుతుంద‌ని న‌మ్ముతుంటారు. రూపాయికి క‌న్నా ఎక్కువ ఇచ్చినా, మిగిలిన డ‌బ్బును తిరిగి ఇచ్చేవాడు బ‌స‌వ‌. అక్కడి ప్రజ‌లను బ‌స‌వ ప్రేమ‌గా అప్పాజీ అని పిలిచేవాడు. స్థానికులు ఆయ‌న‌ను అదృష్ట బ‌స‌వ అని పిలిచి ప్రేమ‌ను పంచేవారు.

కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం ప్రకాశ్‌, మాజీ మంత్రి ప‌ర‌మేశ్వర నాయ‌క్ బ‌స‌వ‌తో పాటు మ‌రికొంత మంది నాయ‌కుల‌ను పేరు పెట్టి పిలిచి, ఒక రూపాయి అడిగేవాడు బ‌స‌వ‌.

అయితే బ‌స‌వ రోడ్డుప్రమాదంలో శ‌నివారం మృతి చెందాడు. దీంతో అత‌ని అంత్యక్రియ‌లు నిర్వహించేందుకు హ‌డ‌గ‌ళ్లి ప‌ట్టణ ప్రజ‌లంతా త‌ర‌లివ‌చ్చారు. ప‌ట్టణ‌మంతా బ‌స‌వ ప్లెక్సీలు, బ్యాన‌ర్లు ఏర్పాటు చేసి త‌మ‌కున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆదివారం రోజు నిర్వహించిన అంతిమ‌యాత్రలో వేలాది మంది పాల్గొని ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.