Mumbai, May 23: గత మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూ పోతుందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పేర్కొన్నారు. టిక్‌టాక్ వీడియోల ద్వారా మహిళలపై నేరాలను ప్రోత్సహించే వారిపై తమ రాష్ట్రంలో కఠిన చర్యలు ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ శాఖ అత్యంత జాగరూకతతో ఉందని ఆయన అనిల్ దేశ్ ముఖ్ పేర్కొన్నారు.
"సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు టిక్‌టాక్ ల ద్వారా నకిలీ వార్తలు, మతపరమైన విద్వేషాలు మరియు మహిళలపై అవమానకరమైన పోస్ట్‌లను వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇది చాలా తప్పు.
టిక్‌టాక్‌లో, మహిళలపై అత్యాచారం మరియు యాసిడ్ దాడిని ప్రోత్సహించే వీడియోలు వైరల్ అవుతున్నాయి. జాగ్రత్తగా ఉండడి, మహారాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం ప్రతీ నిమిషం నిఘా ఉంచుతోంది. పుకార్లు మరియు విద్వేషపూరిత ప్రసంగాలు వ్యాప్తి చేసేవారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఇప్పటికే ఆదేశించాము. అలాగే సోషల్ మీడియాను దుర్వినియోగానికి ఉపయోగించే వారిని కూడా ఎవరూ కాపాడలేరు" అని అనిల్ దేశ్ ముఖ్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
Maharashtra Home Minister Anil Deshmukh's Video Message on Cyber Crime:
Instances of cybercrime have been rising during the #CoronaLockdown. Be warned that @MahaCyber1 is keeping a minute watch. I've ordered swift & decisive action against rumour & hate mongers. Those indulging in slander & misogyny will also not be spared.#MaharashtraGovtCares pic.twitter.com/a0NImVMnM1
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) May 23, 2020
సోషల్ మీడియా ద్వారా పుకార్లు, దుష్ప్రచారాలు వ్యాప్తి చెందుతున్నాయి. సంఘ విద్రోహ చర్యలను అవి ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తూ కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఇండియాలో ప్రస్తుతం ఒక సెన్సేషన్‌గా ఉన్న టిక్‌టాక్ యాప్‌ను దేశంలో నిషేధించాలంటూ పెద్ద ఎత్తున గళమెత్తారు. అది కూడా మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినటువంటి ట్విట్టర్ ద్వారా భారీ వ్యతిరేక ప్రచారం నిర్వహించారు.
ఇటీవల, ఫైజల్ సిద్దిఖీ అనే ఒక టిక్‌టాక్ స్టార్ యొక్క వీడియో వైరల్ అయ్యింది, ఆ వీడియోలో అతడు ఇంకొకరికి బ్రేకప్ చెప్పి తనను ప్రేమించి, ఆ తర్వాత తన నుంచి కూడా విడిపోయే అమ్మాయికి శిక్షగా ఆసిడ్ పోసినట్లు వీడియో చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయి పెద్ద దుమారం చెలరేగింది.
ఆ వీడియోను చూసిన నేషనల్ కమీషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్‌పర్సన్ రేఖ శర్మ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. టిక్‌టాక్ ను దేశం నుంచి పూర్తిగా నిషేధించాలని చెప్పారు. ఈ చైనీస్ యాప్ దేశంలోని యువతను ఎందుకూ ఉపయోగంలేని జీవితం వైపు నెట్టివేస్తుందని అన్నారు.
అయితే టిక్‌టాక్ యాజమాన్యం వివాదాస్పదమైన ఆ వీడియోను డిలీట్ చేయడమే కాకుండా, టిక్‌టాక్ లో 13.4 మిలియన్ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఆ టిక్‌టాక్ స్టార్ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది. అయినప్పటికీ టిక్‌టాక్ మీద మాత్రం వ్యతిరేక ప్రచారం తగ్గడం లేదు.
టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలి అంటూ వేల సంఖ్యలో ట్వీట్స్ దాడి కొనసాగుతోంది. గూగుల్ ప్లే స్టోర్లో చాలా మంది టిక్‌టాక్ యాప్‌కు సింగిల్ డిజిట్ రేటింగ్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో 4.5 పైబడి రేటింగ్స్‌తో కొనసాగిన టిక్‌టాక్ యాప్ రేటింగ్స్ 1.5 కు పడిపోయింది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఇంత నెగెటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య మరింత పెరిగింది. అంతకుముందు ప్లే స్టోర్లో మిలియన్లలో ఉన్న టిక్‌టాక్ డౌన్‌లోడ్లు తాజాగా బిలియన్లు దాటింది.
టిక్ టాక్ యాప్ అత్యాచారాలు మరియు ఆసిడ్ దాడులను ప్రోత్సహిస్తుంది. దీనిని ఇండియా నుంచి బ్యాన్ చేయాలి అని వస్తున్న ఆరోపణలపై మీరేం అనుకుంటున్నారు?