Visuals from the site of violence | (Photo Credits: PTI)

New Delhi, November 5: ఎక్కడైనా సరే న్యాయం కోసం ముందు పోలీసులను ఆశ్రయిస్తారు, ఏదైనా సమ్మె జరుగుతున్నప్పుడు కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. అయితే దేశ రాజధాని దిల్లీలో పరిస్థితులు తిరగబడ్డాయి. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులు ఆందోళన బాటపట్టారు. దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి యూనిఫాంలోనే మెరుపు సమ్మెకు దిగారు, న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో తమ నిరసన వ్యక్తం చేశారు.

అసలు ఏం జరిగిందంటే, గత శనివారం నవంబర్ 02న దిల్లీలోని టిస్ హజారీ కోర్ట్ (Tis Hazari Court) కాంప్లెక్స్‌లో పార్కింగ్ విషయంలో పోలీసులకు మరియు లాయర్లకు మధ్య గొడవ ప్రారంభమై అది ఘర్షణకు దారితీసింది. ఒక లాయర్ కారుకు పోలీస్ వ్యాన్ తగిలి కొంత డ్యామేజ్ అయింది. దీంతో ఇద్దరు గొడవపడ్డారు. పోలీస్ మన లాయర్ ను చితకబాదుతున్నాడని ఓ నలుగురు లాయర్లు మిగతా లాయర్లకు సమాచారం అందించారు. దీంతో పెద్ద సంఖ్యలో లాయర్లు వచ్చి పోలీసులపై దాడికి దిగారు. ఈ దాడిలో 21 మంది పోలీసులు గాయాల పాలయ్యారు. కొన్ని పోలీసు వాహనాలకు కూడా లాయర్లు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో కొంత మంది లాయర్లకు, ప్రజలకు అలాగే ఈ వార్తను కవర్ చేయడానికి వచ్చిన ఓ మహిళా జర్నలిస్టుకు కూడా గాయాలయ్యాయి.

పోలీసులపై లాయర్లు చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలు

అయితే, దాడి చేసిన లాయర్లే పోలీసులపై హత్యాయత్నం, దౌర్జన్యం, విద్వేషపూరిత హాని ఇలా పలు రకాల క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇటు పోలీసులు కూడా విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడి, విధులకు ఆటంకం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం లాంటి కేసులు నమోదు చేశారు. దీనికి తోడు ఒక మహిళా లాయర్ తన పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని కేసు నమోదు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై టిస్ హజారీ కోర్ట్ జడ్జ్ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఈ కేసులన్నీ దిల్లీ క్రైంబ్రాంచ్ పరిశీలిస్తుంది.

ఈ మొత్తం వ్యవహారంలో లాయర్లు, పోలీసులు ఎవరికి వారు విడిపోయారు. లాయర్లకు మద్ధతుగా బార్ అసోసియేషన్ కౌన్సిల్ నిలిచింది. ఈ ఘర్షణలో లాయర్ల తప్పేమి లేదని తేల్చింది. వరుస పరిణామాల నేపథ్యంలో దిల్లీ పోలీసులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిరసనకు ఐపీఎస్ ల సంఘం మద్ధతుగా నిలిచింది.

ఈ కేసును దిల్లీ హైకోర్ట్ (High Court of Delhi) సుమొటో (suo moto) గా స్వీకరించింది. బార్ అసోసియేషన్ కౌన్సిల్ ఇచ్చిన తీర్పును దిల్లీ హైకోర్ట్ నిలుపుదల చేసింది. హోంశాఖ దాఖలు చేసిన ఒక పిటిషన్ తో ఈ కేసును ప్రత్యేక జడ్జితో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది.

Update by ANI:

కాగా, నిరసన వ్యక్తం చేస్తున్న పోలీసు సిబ్బందికి అన్ని రకాల సహాయం అందిస్తామని పోలీసు కమిషనర్ దేవేష్ శ్రీవాస్తవ (Devesh Srivastava) హామీ ఇచ్చారు పోలీసుల డిమాండ్లన్నీ అంగీకరిస్తున్నట్లు తెలిపిన ఆయన వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుతో సంబంధమున్న లాయర్లందరిపై FIR నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి నిరసనలో పాల్గొంటున్న పోలీసులపై కూడా శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు.