Odisha Ex CM Naveen Patnaik (Photo Credit- ANI)

Bhubaneswar, July 19: ఒడిశాను 25 ఏళ్లు పాలించిన మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన సీఎం మోహన్ మాంఝీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్‌ పెట్టడంతోపాటు జవాబుదారీని చేసేందుకు ‘షాడో క్యాబినెట్’ ఏర్పాటు చేశారు. (Shadow cabinet ) 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు పలు శాఖలు కేటాయించారు. మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరిపాలన, ప్రజా ఫిర్యాదులను ప్రతాప్ దేబ్ పర్యవేక్షిస్తారు. మాజీ మంత్రి నిరంజన్ పూజారి గృహ, ఆహారం, వినియోగదారుల సంక్షేమ శాఖలను పర్యవేక్షిస్తారు. షాడో మంత్రివర్గానికి సంబంధించిన ఒక ఉత్తర్వును ఆ పార్టీ జారీ చేసింది.

 

కాగా, నవీన్‌ పట్నాయక్‌ ఏర్పాటు చేసిన ఈ షాడో క్యాబినెట్ ప్రభుత్వ అధికారిక సంస్థ కాదు. అలాగే ఎలాంటి అధికారాలు ఉండవు. జూలై 22 నుంచి ఒడిశా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యలో ప్రభుత్వంలోని ఆయా శాఖల నిర్ణయాలు, విధానాలను నిశితంగా పరిశీలించే బాధ్యతను ఈ షాడో మంత్రివర్గానికి అప్పగించారు. దీంతో అసెంబ్లీలో చర్చ సమయంలో ఆయా శాఖలను పర్యవేక్షించే బీజేడీ ఎమ్మెల్యేలు సంబంధిత మంత్రులను ఎదుర్కొంటారు. తద్వారా సీఎం మోహన్ మాఝీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్‌ పెట్టనున్నారు.

మరోవైపు ఒక రాష్ట్రంలో ‘షాడో క్యాబినెట్’ (Odisha Shadow Cabinet) ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్‌లో ప్రతిపక్ష పార్టీలకు ‘షాడో క్యాబినెట్’ మాదిరి సంస్థాగత వ్యవస్థలు ఉన్నాయి. కెనడాలో షాడో మంత్రి పదవులు కలిగిన వారిని ‘ప్రతిపక్ష విమర్శకుడు’గా వ్యవహరిస్తారు.

ఇక బ్రిటన్‌లోని షాడో క్యాబినెట్‌లో ఎక్కువ మంది సీనియర్ ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. ప్రతి ఒక మంత్రికి ఒక షాడోను నియమిస్తారు. ఆ మంత్రి పనితీరు, అభివృద్ధి విధానాలను వారు అధ్యయనం చేస్తారు. ఆ మంత్రులు తీసుకునే నిర్ణయాలు, చర్యలకు వారిని బాధ్యులుగా చేస్తారు.