United Territories Jammu and Kashmir, Ladakh on Map. |File Photo

Jammu, October 31:  భారతదేశంలో చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. అక్టోబర్ 31, గురువారం నుండి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలు (Union Territories)గా అధికారికంగా ఉనికిలోకి వచ్చాయి. ఇకపై ప్రతీ ఏడాది అక్టోబర్ 31వ తేదీ జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) మరియు లద్దాఖ్ (Ladakh) యూటీలకు అవతరణ దినోత్సవంగా పరిగణించబడుతుంది.

జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370లోని నిబంధనలను ఈ ఏడాది ఆగస్టు 5న మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆగస్టు 9న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అందుకు ఆమోద ముద్రవేశారు, జాతీయ సమైఖ్యత కోసం విశేష కృషి చేసిన 'ఉక్కు మనిషి' సర్దార్ పటేల్ జయంతి అక్టోబర్ 31 రోజే జమ్మూ కాశ్మీర్ రెండు వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించనున్నట్లు గెజెట్ విడుదల చేశారు. ఇకపై భారతదేశంలో 28 రాష్ట్రాలే! జమ్మూ- కాశ్మీర్ వివాదం ఏంటి? దానికి స్పెషల్ స్టేటస్ ఎందుకు లభించింది?

జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇక నుంచి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2019 లోని సెక్షన్ 2 లోని క్లాజ్ (ఎ) ద్వారా ఇవ్వబడిన అధికారాలు కేంద్ర ప్రభుత్వం వినియోగించుకోవచ్చు. దీని ప్రకారం అక్టోబర్ 31, 2019, జమ్మూ కాశ్మీర్ 'అపాయింట్‌మెంట్ డే' అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ యూటీ అసెంబ్లీ స్థానాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని ఈ చట్టం తెలిపింది.

ఇక జమ్మూ కాశ్మీర్ యొక్క మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఐఎఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్ము నియమింపబడ్డారు. అలాగే, రాధా కృష్ణ మాథుర్‌ను లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు. ఇంతకాలం జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా వ్యవహరించిన సత్య పాల్ మాలిక్‌ను బదిలీ చేసి గోవా గవర్నర్‌గా నియమించారు.

అక్టోబర్ 31, 2019 జమ్మూ కాశ్మీర్ లో ఏం మారుతుంది

అక్టోబర్ 31 నుండి, జమ్మూ కాశ్మీర్‌ భూభాగం పాలన కేంద్ర అధికారంలోకి వస్తుంది. పుదుచ్చేరి తరహాలో అసెంబ్లీ ఉంటుంది. ఈ అసెంబ్లీకి నిర్ణయాలు తీసుకునే అధికారులు కూడా పరిమితంగా ఉంటాయి.

ఇటు లద్దాఖ్ అసెంబ్లీ లేకుండా ఛండీఘర్ తరహా యూటీలాగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. లద్దాఖ్ యూటీలో కార్గిల్ మరియు లేహ్ జిల్లాలు ఉంటాయి. కొత్తగా ఏర్పడిన ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో 'లా అండ్ ఆర్డర్' సహా పలు ముఖ్యమైన అంశాలన్నీ కేంద్రం పరిధిలోకి వస్తాయి.

జమ్మూ కాశ్మీర్ యూటీలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 107, లద్దాఖ్ లోని 4 కలిపితే 111 స్థానాలు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 114కు పెంచబడుతుంది. అయితే జమ్మూ కాశ్మీర్ లోని కొంతభాగం పాకిస్తాన్ ఆక్రమిత (PoK) పరిధిలో ఉండటంతో దాని పరిధిలోకి వచ్చి 24 అసెంబ్లీ స్థానాలు ఖాళీగానే కొనసాగనున్నాయి. ఈ ప్రకారంగా ప్రస్తుతం, జమ్మూ కాశ్మీర్ లో ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడే అసెంబ్లీ స్థానాల సంఖ్య 87. (111- 24=87).

ఇదిలా ఉండగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. తుఫానుకు ముందు కనిపించే నిశబ్దంలా పరిస్థితి కనిపిస్తుంది. కాశ్మీర్ లోని నాయకులు ఇప్పటికే ఇదొక నిర్బంధమైన, నిరంకుశమైన అవతరణ దినోత్సవంగా అభివర్ణిస్తున్నారు. కశ్మీరి ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండానే జరిగిన విభజనగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో కాశ్మీర్ లోయలో మళ్ళీ ఉద్రిక్తలు చెలరేగుతాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అందుకనుగుణంగా కేంద్రం కూడా బలగాలను సిద్ధంగా ఉంచింది.