New Delhi, June 14: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉడాయ్ సంస్థ ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ వివరాలు అప్‌డేట్ (Free Aadhaar Update) చేసుకొనేందుకు కల్పించిన అవకాశం బుధవారంతో ముగియనుంది. ఈ సేవలు ‘మై ఆధార్’ (My Aadhar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టిన తేది, చిరునామా వంటి వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఈ గడువు ముగిశాక ఆధార్ సేవా కేంద్రాల్లో నిర్ణీత రుసుము చెల్లించి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉడాయ్ (UIDAI) నిబంధనల ప్రకారం ప్రతి పదేండ్లకు ఒకసారి ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. అందుకు తగిన రుజువు పత్రాలు సమర్పించాలి. ఆధార్ ప్రారంభించిన తొలినాళ్లలో తీసుకున్న వారి కార్డుల వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఫొటోలు, చిరునామాల మార్పు, తప్పొప్పులతో తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో, వారు అనేక ఇక్కట్లకు గురికావాల్సి వస్తున్నది. దీనిపై విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థకు కూడా పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆధార్ కార్డుల సవరణతోపాటు అప్‌డేట్ (Free Aadhaar Update) చేసుకునే అవకాశం కల్పించింది.
Keep Demographic Details Updated to Strengthen Your #Aadhaar.
If your Aadhaar had been issued 10 years ago & had never been updated - you may now upload Proof of Identity & Proof of Address documents online at https://t.co/CbzsDIBUbs ‘FREE OF COST’ from 15 March - June 14, 2023. pic.twitter.com/CFsKqPc2dm
— Aadhaar (@UIDAI) March 16, 2023
2014 కంటే ముందు ఆధార్ పొందిన వారు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ, ఉత్తర్వులు విడుదల చేసింది. కార్డు నవీకరణ చేసుకునేందుకు జూన్14 వరకు గడువు కూడా విధించింది. చిన్నారులకు కార్డు తీసుకుని ఐదేండ్లు దాటితే వేలిముద్రలు, ఫొటోలను కూడా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. పదేళ్ల కింద ఆధార్ కార్డు పొందిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ఉపాధికార సంస్థ(UIDAI) సూచిస్తున్నది.
ప్రధానంగా 2010 -18 వరకు ఆధార్ (Aadhar) నమోదు చేసుకున్న కార్డుదారులు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వివాహానికి ముందు తండ్రి పేరిట ఉన్న మహిళల కార్డులు వివాహానంతరం భర్త పేరు మార్చుకునేందుకు గతంలో వీలు లేకుండే, దీనికి ఆయా స్థానాల్లో కేరాఫ్‌గా మాత్రమే కొనసాగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం వాటిని కూడా మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. డబ్భు ఏళ్లు దాటిన వారికి నవీకరణలో మినహాయింపునిచ్చారు. తప్పొప్పులు సవరించుకునే వారు తమ పదో తరగతి, పాన్, ఓటర్ కార్డు, పాస్ పోర్టుల్లో ఏదో ఒకటి జతపర్చాల్సి ఉంటుంది. అందులో చిన్నారులకు వారి తల్లిదండ్రుల చేతి ముద్రలతో ఆధార్ కార్డు జారీ చేశారు. ఎలాంటి రుసుం చెల్లించకుండా ఆన్‌లైన్‌లో స్వతహాగా కూడా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పించింది.
మై ఆధార్ పోర్టల్, ఎం-ఆధార్ యాప్ ద్వారా myaadhaar.uidai.gov.in పోర్టల్ ఓపెన్ చేసి ఫోన్ నంబర్ నమోదు చేశాక వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాలి. అనంతరం చిరునామా నిరూపించే పత్రాన్ని అప్‌లోడ్ చేసి సమర్పించాలి. వెంటనే ఆధార్ అప్డేట్ పూర్తయినట్లు ఫోన్ నంబర్‌కు మేసేజ్ వస్తుంది.
ఆధార్ సెంటర్లలో కార్డుల నవీకరణ కోసం ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మీ సేవ కేంద్రాల్లో రుసుం వసూలుపై స్పష్టమైన నిబంధనలు విధించారు. బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం 100, డెమోగ్రాఫిక్ అప్‌డేట్‌కు 50, ఆధార్ డౌన్ లోడ్, కలర్ ప్రింట్‌కు 30 చెల్లించాలి. అందులో సెంటర్ల నిర్వాహకులు తిరకాసు పెట్టినా, అదనంగా డబ్బులు వసూలు చేసినా, సంబంధిత ఆధార్ సెంటర్ కోడ్ నెంబర్‌తో టోల్ ఫ్రీ 1947 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.