Jharkhand November 12:మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్, ఆయన భార్య శీలా మరాండిని జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్ బోస్ మావోయిస్టు సీనియ‌ర్ నాయ‌కుల‌లో ఒక‌రు. మావోయిస్టు క‌మ్యూనిస్ట్ సెంట‌ర్ ఆఫ్ ఇండియాచీఫ్‌గా ప్రశాంత్ బోస్ కొన‌సాగారు. ప్రశాంత్ బోస్ భార్య షీలా మ‌రాండీ కూడా మావోయిస్టు పార్టీలో అగ్ర నాయ‌కురాలు. 75 ఏండ్ల ప్రశాంత్ బోస్ గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్య స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్నారు.

ప్రశాంత్ బోస్ ప్రస్తుతం సీపీఐ మావోయిస్టు సెంట్రల్ క‌మిటీ మెంబ‌ర్‌, పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిల‌ట‌రీ క‌మిష‌న్, ఈస్ట్రన్ రీజిన‌ల్ బ్యూరో సెక్రట‌రీగా కొన‌సాగుతున్నారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్‌తో పాటు బీహార్, జార్ఖండ్‌, బెంగాల్, ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్రాల్లో విప్లవోద్యమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ బోస్ జార్ఖండ్‌లోని స‌రందా అడ‌వుల నుంచి పార్టీ కార్యక‌లాపాల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు. ఆయనపై కోటి రూపాయల రివార్డు ఉంది.

ప్రశాంత్ బోస్ వెస్ట్ బెంగాల్‌లోని జాద‌వ్‌పూర్‌కు చెందిన‌వారు. ఆయన్ను మావోయిస్టు పార్టీలో కిష‌న్ దా అలియాస్ నిర్భయ్, కిష‌న్, కాజ‌ల్, మ‌హేశ్‌గా పిలుస్తారు.

ప్రశాంత్ బోస్ భార్య షీలా మ‌రాండీ ప్రస్తుతం సెంట్రల్ క‌మిటీ మెంబ‌ర్‌గా కొన‌సాగుతున్నారు. ఒడిశాలో 2006లో ఆమె అరెస్టు అయ్యారు. రూర్కీలా జైల్లో శిక్ష అనుభ‌వించిన అనంత‌రం ఆమె విడుద‌ల‌య్యారు. ఐదేండ్ల క్రితం ఆమె తిరిగి సీపీఐ పార్టీలో చేరారు. షీలా మరాండీ జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్ జిల్లాకు చెందిన‌వారు.