New Delhi, Febuary 01: ఓ రాష్ట్రం, లేక దేశంలో ఉన్న మొత్తం ప్రజల ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగాలంటే బడ్జెట్ (Budget) అనేది చాలా అవసరం. బడ్జెట్ వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలకు నిధుల కేటాయింపులతో పాటు లక్ష్యాలను కూడా నిర్దేశించుకునే అవకాశం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంత ఆదాయం రావొచ్చు.. ఇంత మొత్తంలో ఖర్చులు ఉండొచ్చు అని ముందుగా లెక్కలు వేయడాన్ని బడ్జెట్ అని చెప్పుకోవచ్చు.
ప్రభుత్వం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రతి ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి ఏటా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ఈ బడ్జెట్‌ను ఆవిష్కరిస్తారు. గత బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ 2020ని (Budget 2020) కూడా ఫిబ్రవరి 1న నిర్మలానే ఆవిష్కరించనున్నారు.
5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ భారత్ లక్ష్యం
2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి మరుసటి ఏడాది మార్చి 31 తేదీల మధ్య ఆ బడ్జెట్ వర్తిస్తుంది. మళ్లీ ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమలులోకి వస్తుంది. నూతన బడ్జెట్‌లో ప్రతిపాదించిన అంశాలు, పన్నులో వ్యత్యాసాలు వంటివి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలవుతాయి.
బడ్జెట్ 2020లో రైతులకు మరో రెండు కీలక పథకాలు
గతాన్ని ఓ సారి పరిశీలిస్తే.. మన దేశంలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న తేదీ మారుతూ వచ్చిందనే చెప్పాలి. 2017 ముందు వరకు ఫిబ్రవరి చివరి పని దినం రోజున ప్రవేశపెట్టేవారు. 2017 తర్వాత ఇది ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతూ వస్తున్నారు. భారత్‌లో తొలి బడ్జెట్‌ను ఆర్.కె.షణ్ముఖం చెట్టీ 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టారు. ఇందులో కేవలం ఆర్థిక వ్యవస్థ సమీక్ష మాత్రమే ఉంది. ఎలాంటి కొత్త పన్నులను ఈ బడ్జెట్లో ప్రతిపాదించలేదు.
బడ్జెట్‌కు పార్లమెంట్ (Parliament) ఉభయసభలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఏదైనా సందర్భంలో బడ్జెట్‌కు పార్లమెంట్ (Parliament of India) ఆమోదం లభించకపోతే.. ఖజానాలో ఉన్న డబ్బును కేంద్ర ప్రభుత్వం వినియోంచడం అంత తేలిక కాదు. అయితే ప్రతి రూపాయి ఖర్చుకి పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మన రాజ్యాంగం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. దీంతో ప్రభుత్వాలు కచ్చితంగా బడ్జెట్ ఆమోదం పొందేలా జాగ్రత్త పడతారు.