
New Delhi, July 23: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ (Union Budget) ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా విభజన చట్టం మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు కేటాయించిన (Amaravati Budget Allocations) విషయం తెలిసిందే. అప్పుగా ఇచ్చారా..? లేదంటే గ్రాంట్ ఇచ్చారా? అన్న విషయంపై ఆర్థిక మంత్రి బడ్జెట్ (Nirmala Sitaraman) ప్రసంగంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే, బడ్జెట్ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానెల్ ప్రతినిధి అమరావతి, పోలవరం తదితర అంశాలపై ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అమరావతి అంశం ఉందని.. ఏపీ రాజధానికి కేంద్రం సాయం చేయాలని చట్టంలో ఉందన్నారు. దాని ప్రకారం తప్పనిసరిగా ఏపీకి సాయం చేయాల్సి ఉందన్నారు. తాజాగా అమరావతికి (Amaravati Budget Allocations) కేటాయించిన రూ.15వేలకోట్లు ప్రపంచ బ్యాంక్ (World bank) నుంచి రుణం తీసుకుంటున్నామని.. తదనంతరం నిధుల కేటాయింపు ఉంటుందన్నారు. అయితే, చెల్లింపులు ఎలా? అన్నదానిపై ఏపీ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎలా చెల్లించాలన్నది వారితో చర్చించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటాను చెల్లించగలుగుతారా? లేదా? అన్న విషయంపై మాట్లాడాల్సి ఉందన్నారు. అప్పుడు వాళ్ల వాటాను కూడా కేంద్రమే గ్రాంట్‌గా ఇవ్వడమన్నది రాష్ట్రంతో మాట్లాడాక నిర్ణయిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ముందుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రాజధాని రాజధాని లేకుండానే పదేళ్లు గడిచాయని.. దేశంలో ఒక రాష్ట్రం ఉందంటే తప్పనిసరిగా రాజధాని ఉండాలని.. కానీ, రాజధాని లేకుండా ఉన్నది ఆంధ్రా మాత్రమేనన్నారు. దీనికి కారకులు ఎవరు అనే అంశం జోలికి తాను వెళ్లదలచుకోలేదని.. రాజధాని నిర్మించేందుకు కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని.. దాని బాధ్యత కేంద్రానిదేనన్నారు.