New Delhi, April 05: రోజురోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. ఏఐ ఆధారిత చాట్ బోట్‌లు వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ సాయంతో రూపుదిద్దుకున్న డీప్ ఫేక్ వీడియోలు (Deep Fakes) సోషల్ మీడియాలో వైరలయ్యాయి. సినీ ప్రముఖులు బాధితులుగా మారారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వినియోగంపై నియంత్రణ తీసుకొస్తామని కేంద్రం చెబుతున్నది. ఏఐ టెక్నాలజీ నియంత్రణ కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని భావిస్తున్నది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నియంత్రణకు చట్టం రూపకల్పన చర్యలు ప్రారంభిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం విషయమై స్వీయ నియంత్రణ అనేది ఎంత మాత్రమూ సరిపోదని, అది చట్టబద్ధంగా జరుగాలని ప్రభుత్వం భావిస్తు్న్నదని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ పరిశ్రమ ప్రతినిధులతో చర్చించామని, సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో దఫా చర్చించి చట్టం తీసుకు వస్తామని చెప్పారు. క్రియేటివిటీ, కొత్త ఆవిష్కరణలకు విఘాతం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చట్టం రూపొందిస్తామన్నారు.