Supreme Court of India. File Image. (Photo Credits: ANI)

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి రోడ్డు ప్రమాద ఘటన దర్యాప్తు కోసం నాలుగు వారాల సమయం ఇవ్వాలన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రెండు వారాల్లో దర్యాప్తును పూర్తి చేయాలని అపెక్స్ కోర్ట్ సిబిఐని ఆదేశించింది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం మరో వారం గడువును పొడగించుకోవచ్చునని స్పష్టం చేసింది.

అదే విధంగా, వైద్య ఖర్చుల కోసం న్యాయవాదికి రూ .5 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని అపెక్స్ కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఈ కేసుపై తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది.

ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు గత జూలై 28న ఆమె న్యాయవాదితో కలిసి ఉన్నావ్ నుంచి రాయబరేలీ వైపు కారులో ప్రయాణిస్తుండగా, వారి కారును ఎదురుగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు మరియు ఆమె న్యాయవాది ఆనాడు ప్రాణాలతో బయటపడగలిగారు కానీ, తీవ్రగాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. లాయర్ పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది. వీరిద్దరి వాంగ్మూలాన్ని సిబిఐ ఇంకా నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో తమకు నాలుగు వారాల గడువు కావాలని సిబిఐ కోరగా, సుప్రీం మాత్రం రెండు వారాల గడువుతో సరిపెట్టింది. వీరి రోడ్డు ప్రమాదం కేసును వారం రోజుల్లోగా, అలాగే అత్యాచార కేసును 45 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి తమకు పూర్తి నివేదికను అందజేయాలని ధర్మాసనం సిబిఐకి నిర్ధేశించింది.