UP Shocker: కోమాలో ఉన్నాడని చెబుతూ ఏడాదిగా ఇంట్లోనే మృతదేహం.. మృతదేహాన్ని మమ్మీలా మార్చి ఏడాదిగా ఇంట్లోనే పెట్టుకున్న కుటుంబం.. ఇప్పటికీ బతికే ఉన్నాడంటూ వాదన .. ఉత్తరప్రదేశ్‌లోని రోషన్ నగర్‌లో ఘటన
Representaional Image

Lucknow, September 24: చనిపోయిన వ్యక్తి కోమాలో (Coma) ఉన్నాడని చెబుతూ ఏడాదిగా అతడి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుందో కుటుంబం (Family). విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా అంత్యక్రియులు నిర్వహించేందుకు ససేమిరా అంది. చివరకు సీఎంవో (CMO) అధికారుల జోక్యంతో ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ కాన్పూరులోని రోషన్ నగర్‌లో జరిగిందీ ఘటన. ఓ కుటుంబం ఏడాదిన్నరగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుందన్న సమాచారంతో ఆరోగ్యశాఖ అధికారుల బృందం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మృతదేహాన్ని బట్టతో గట్టిగా చుట్టి ‘మమ్మీ’లా మార్చారని తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రోషన్ నగర్‌కు చెందిన విమలేశ్ (38) ఆదాయపన్ను శాఖలో పనిచేసేవారు. గతేడాది ఏప్రిల్‌లో ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో అతడు మళ్లీ స్పృహలోకి వచ్చాడని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి ఓ బెడ్‌పై ఉంచారు. విమలేశ్ కోమాలోకి వెళ్లారని బంధువులకు చెప్పారు. విమలేశ్ భార్య మిథాలీ పింఛను కోసం ఆయన మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఘోర విషాదం, ట్రాక్టర్‌ వేగంగా వెళ్తుండగా ఓవర్ టేక్ చేయబోయిన బైక్, అదుపు తప్పడంతో టైర్ల కింద పడి నలిగిపోయిన ఆరు నెలల చిన్నారి

మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అజామ్‌గఢ్ పోలీసులు, హెల్త్ అధికారుల బృందం బాధిత కుటుంబం ఇంటికి చేరుకుంది. అయితే, మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆయన కోమాలోకి వెళ్లాడని, బతికే ఉన్నాడని వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా విమలేశ్ తండ్రి మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతుంటే గతేడాది ఏప్రిల్‌లో విమలేశ్‌ను ఆసుపత్రిలో చేర్చామని, అక్కడాయన చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. ఇంటికి తీసుకొచ్చాక ఆయన గుండె కొట్టుకుంటుండడంతో బతికే ఉన్నాడని భావించి అంత్యక్రియలు నిర్వహించలేదని చెప్పారు. అంతేకాదు, ఇంకా బతికే ఉన్నాడని చెప్పడం గమనార్హం. అధికారులు చివరికి వారిని ఒప్పించి పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు.