Joe Biden Gift to Nicholas Dias

New Delhi, SEP 10: జీ20 సదస్సులో (G 20 Summit) పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను (Joe Biden) శనివారం రాత్రి ఢిల్లీ చర్చి ఫాదర్ నికోలస్ డయాస్‌ (Nicholas Dias) కలిశారు. ఈ సందర్భంగా బైడెన్‌ కోసం నికోలస్‌ డయాస్‌ ప్రత్యేకంగా ఓ చర్చి సర్వీస్‌ను నిర్వహించారు. ఈ సర్వీస్‌లో జీ20 సదస్సు విజయవంతం కావాలంటూ మూకుమ్మడి ప్రార్ధనలు చేశారు. శనివారం రోజు రాత్రి ఫాదర్‌.. జో బైడెన్ బస చేసిన హోటల్‌కు వెళ్లి ఆయనను కలుసుకున్నారు. చర్చి సర్వీస్‌ ముగిసిన అనంతరం నికోలస్ డయాస్‌ సేవలను మెచ్చి బైడెన్ ఆయనకు ఓ అరుదైన నాణేన్ని బహుమతిగా ఇచ్చారు.

ఇవాళ మధ్యాహ్నం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం నికోలస్‌కు నాణేన్ని అందజేసింది. ఈ నాణెంపై జోసఫ్ ఆర్ బైడెన్ జూనియర్ పేరుతో ఆయన సంతకం చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 46వ అధ్యక్షుడు అనే అక్షరాలతోపాటు 261 అనే సంఖ్యను ముద్రించారు. మరో వైపున అమెరికా అధ్యక్షుడి అధికారిక చిహ్నాన్ని ముద్రించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 260 మందికి మాత్రమే ఈ నాణెం అందిందని ఫాదర్ నికొలస్ తెలిపారు. ఇప్పుడు 261వ వ్యక్తిగా తనకు ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. యూఎస్ ఎంబసీ అధికారులు దీన్ని తనకు అందజేశారని చెప్పారు.

 

కాగా, ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోగల భారత్ మండపంలో రెండు రోజులపాటు ఈ సమావేశం కొనసాగింది. ఆదివారం మధ్యాహ్నం చివరి సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అనంతరం వచ్చే ఏడాది జరగబోయే జీ20 ప్రెసిడెన్సీని బ్రెజిల్‌కు అప్పగించారు. మోదీ చేతుల మీదుగా ప్రెసిడెన్సీని ఆ దేశాధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వ అందుకున్నారు. 2024 నాటి జీ20 సదస్సును తమ దేశ రాజధాని రియో డి జనీరోలో నిర్వహిస్తామని ప్రకటించారు.