Chamoli, February 14: ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేసిన వరదల్లో గల్లంతైన వారికోసం వెతుకులాట ఇంకా కొనసాగుతోంది. ఎన్టీపీసీకి చెందిన తపోవన్–విష్ణుగాద్ హైడల్ ప్రాజెక్టు సొరంగంలో దాదాపు 30 మంది చిక్కుకొని ఉన్నారన్న సమాచారం మేరకు, వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ఆర్పీ అహిర్వాల్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు మూడంచెల వ్యూహాన్ని రచించామని అన్నారు.
లోపల ఉన్నవారి స్థానాన్ని గుర్తించేందుకు, లోపలి నీటిని బయటకు తోడేసేందుకు అంగులం వెడల్పైన రంధ్రాన్ని చేశాం. ఈ రంధ్రం గుండా కెమెరాను పంపి వారిని గుర్తించే ప్రయత్నం చేస్తాం. లోపల ఒకవేళ నీరు ఉంటే వాటిని బయటకు తోడేసేందుకు అవసరమైన యంత్రాలను కూడా తీసుకొచ్చాం. సొరంగంలోకి బురద నీరు వెళ్లే మార్గాన్ని పెద్ద యంత్రాల ద్వారా దారి మళ్లించాం. లోపల ఉన్న వారిని రక్షించడమే లక్ష్యంగా 100 మంది సైంటిస్టులను రంగంలోకి దించామని తెలిపారు.
సహాయక చర్యలు, వెలికతీతల వ్యవహారంపై డీఐజీ నీలేశ్ ఆనంద్ భార్నే మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ 41 మృతదేహాలను (Death Toll Rises to 41 ) గుర్తించామని తెలిపారు. 18 మందికి చెందిన శరీర భాగాలు లభ్యమయ్యాయని, వాటిని డీఎన్‌ఏ పరీక్షలకు పంపినట్లు చెప్పారు. వాటిలో పదింటికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని వెల్లడించారు. ఇంకా 163 మంది గల్లంతై ఉన్నారని తెలిపారు.
ANI Update
Two bodies found this morning from escape tunnel are suspected to be casualties of the glacier mishap. Overnight excavation has resulted in debris mostly. Teams have reached upto 130m inside & trying to fasten the process to reach next tunnel soon: Ashok Kumar, Uttarakhand DGP pic.twitter.com/N4WE77sR8g
— ANI (@ANI) February 14, 2021
తపోవన్ సొరంగంలో ఉన్న వారిని రక్షించేందుకు పలు రకాల యంత్రాలను సొరంగం వద్దకు చేర్చినట్లు జనరల్ మేనేజర్ అహిర్వాల్ చెప్పారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుకు సంబంధించిన పలువురు అనుభవజ్ఞులైన కార్మికులు వరదల్లో (Uttarakhand Glacier Burst) గల్లంతయ్యారని, కొత్త కార్మికులతో ఈ చర్యలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పై ప్రాంతం నుంచి సొరంగం వైపు వస్తున్న వరద నీరు కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని, అయితే పూర్తి స్థాయిలో నిలిచిపోవట్లేదని చెప్పారు. ధౌలిగంగ నదిని అసలైన దారిలో వెళ్లేలా చేయడమే తమ ముందున్న అతి పెద్ద లక్ష్యమని, దానికి అనుగుణంగా ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) తీవ్రమైన మెరుపు వరదలు సంభవించే గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 385 గ్రామాలు ఈ ప్రమాద జోన్‌లో ఉండగా, వాటిలో 5 గ్రామాలను తరలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గురువారం రూ. 2.38 కోట్లను విడుదల చేశారు. 385 గ్రామాల తరలింపునకు దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు అవ్వచ్చని అధికారులు అంచనా వేశారు.
వరదలు సంభవించే గ్రామాలు
పితోర్ గఢ్ జిల్లాలో 129 గ్రామాలు, ఉత్తరకాశిలో 62, చమోలిలో 61, బగేశ్వర్‌లో 42, తెహ్రీలో 33, పౌరిలో 26, రుద్రప్రయాగ్‌లో 14, చంపావత్‌లో 10, అల్మోరాలో 9, నైనిటాల్‌లో 6, డెహ్రాడూన్ లో 2, ఉదమ్ సింగ్ నగర్‌లో 1 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో తెహ్రీ, చమోలి, ఉత్తరకాశీ, బగేశ్వర్‌లోని అయిదు గ్రామాలను తరలించేందుకు తాజాగా నిధులు జారీ అయ్యాయి.