Uttarakhand Glacier Burst (Photo Credits: PTI)

Dehradun, February 9: ఉత్తరాఖండ్‌లో మంచుకొండ విరిగిపడి జలవిలయం సంభవించిన చమోలో జిల్లాలో పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారంనాడు ఏరియల్ సర్వే జరిపారు. జోషిమఠ్‌లోని ఐటీబీపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడిన 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, త్వరలోనే వారు కోలుసుకుంటారని వైద్యులు తెలిపారని చెప్పారు.

కాగా, జలవిలయంలో (Uttarakhand Glacier Burst) మృతుల సంఖ్య తాజాగా 28కు చేరుకోగా, 170 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో సొరంగంలో చిక్కుకున్న 35 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ రాత్రి నుంచి కొనసాగుతోందని, శిథిలాల తొలగింపు జరుగుతోందని డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. సాయంత్రానికి కల్లా మార్గం క్లియర్ అవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ఈ ప్రళయానికి (Glacier Burst in Uttarakhand) ముందు కొండచరియలు విరిగిపడిన తరువాతి శాటిలైట్ దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ దృశ్యాలను చూస్తే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో ఇట్టే అర్థమవుతుంది. ప్లానెట్ ల్యాబ్స్ ఇంక్ విడుదల చేసిన ఈ శాటిలైట్ దృశ్యాలు అక్కడి బీభత్స వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఈ ప్రళయానికి ముందు అంటే ఫిబ్రవరి 6న కొండచరియలు సాధారణంగానే కనిపిస్తున్నాయి. అలాగే ఫిబ్రవరి 7న కొండ చరియలు విరిగిపడిన దృశ్యం కనిపిస్తోంది.

ఉత్తరాఖండ్ విలయం, 12 మందికి ప్రాణం పోసిన ఫోన్ కాల్, ఐటీబీపీ అధికారుల చలవతో సురక్షితంగా బయటకు, ఐటీబీపీకి ధన్యవాదాలు తెలిపిన కార్మికులు

దీనితోపాటు థౌలిగంగ నదిలో పెరిగిన వరద ఉధృతి, ఎగసిపడుతున్న దుమ్ము, ధూళి కనిపిస్తున్నాయి. ఈ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా భూమి సద్దుబాట్ల కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ నిపుణులు భావిస్తున్నారు. ఈ విలయానికి కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

చమోలీ జిల్లా, జోషిమఠ్‌ దగ్గర్లోని నందాదేవి హిమనీనదం వద్ద అనూహ్యంగా భారీ ఎత్తున మంచు చరియలు విరిగిపడడంతో గంగానది ఉపనదులైన అలకనంద, రిషి గంగ, ధౌలీ గంగ నదులకు వరద పోటెత్తిందని, దాంతో ఈ జల ప్రళయం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నదీమార్గంలోని పర్వతం పై నుంచి లక్షలాది మెట్రిక్‌ టన్నుల మంచు ఒక్కసారిగా, వేగంగా కిందకు విరుచుకుపడడంతో ఈ జల ప్రళయం సంభవించి ఉంటుందని భావిస్తున్నామని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ (CM Trivendra Singh Rawat) తెలిపారు.