FASTag Update: ఇక నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు, నవంబర్ 30 నుంచే ఎలక్ట్రానిక్ టోల్ విధానం అమలు, గడువులోపు వాహనదారులందరూ ఫాస్టాగ్ కలిగి ఉండాలి
Toll Plaza - FASTag- Representational Image | Photo:PTI

New Delhi, November 22:  దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజా వద్ద నవంబర్ 30 నుంచే ఎలక్ట్రానిక్ విధానం (FASTag) ద్వారా టోల్ ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా (NHAI)  ప్రకటించింది. ఇప్పటివరకు టోల్ ప్లాజాలలో ఒక లేన్‌లో మాత్రమే ఫాస్టాగ్‌ సదుపాయం అందుబాటులో ఉండగా, నవంబర్ 30 (November 30)  నాటికి అన్ని లేన్‌లు డిజిటైలేజషన్ కాబడతాయని పేర్కొంది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలన్నింటికి సంబంధించి (ద్విచక్ర వాహనాలు మినహా) టోల్ చెల్లింపు ప్రక్రియ RFID- ఆధారిత ఫాస్టాగ్‌లకు అనుసంధానించబడిన ఖాతాల ద్వారానే జరుగుతుందని స్పష్టం చేసింది.

గతంలో కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ డిసెంబర్ 1 నుండి ప్రతీ వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి అని పేర్కొంది. అయితే అందుకు ఒకరోజు ముందు నుంచే ఫాస్టాగ్ విధానం అమలు చేయాలని NHAI నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా గల 155 టోల్ కేంద్రాలలో నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఫాస్టాగ్‌) కార్యక్రమం పూర్తి చేయబడిందని NHAI చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ సింగ్ తెలిపారు. అసలు FAStag అంటే ఏమిటి? ఎలా పొందాలి? ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు

ఫాస్టాగ్ విధానం అమలు చేస్తున్నపుడు అన్ని లేన్‌లలో, ఒక లేన్ రెండు విధాల చెల్లింపులకు అనగా, ఫాస్టాగ్ రూపంలో మరియు క్యాష్ రూపంలో చెల్లించేందుకు అనుమతిస్తాము. హైబ్రిడ్ లేన్‌గా పిలవబడే ఈ లేన్ టోల్ ప్లాజాకు పూర్తి ఎడమ పక్కగా ఉంటుంది. భారీ వాహనాల కోసం ఇది నిర్ధేషించబడింది. అయితే ఫాస్టాగ్ లేని వాహనాలకు ఈ లేన్ గుండానే అనుమతించబడుతుంది. ఫాస్టాగ్ లేకుండా ఏదైనా కారు ప్రవేశిస్తే దానికి సాధారణం కంటే రెట్టింపు టోల్ ఛార్జీ వసూలు చేయబడుతుందని రాజీవ్ సింగ్ పేర్కొన్నారు.

ఫాస్టాగ్ పొందాలనుకునే వాహనదారులు NHAI మరియు అనుబంధ శాఖల ద్వారా ఈరోజు నవంబర్ 22 నుంచి నవంబర్ 30 వరకు ఉచితంగా తీసుకోవచ్చు అని తెలిపారు. లేదా వివిధ బ్యాంకుల ద్వారా మరియు అమెజాన్ లాంటి ఇ-కామర్స్ సంస్థల ద్వారా రూ. 100 ఫీజుతో ఫాస్టాగ్స్ కొనుగోలు చేయవచునని రాజీవ్ సింగ్ తెలిపారు. ఈ ఫాస్టాగ్స్ కేవలం జాతీయ రహదారులపైనే కాక, రాష్ట్ర రహదారులకు సంబంధించిన టోల్ ప్లాజాలో కూడా ఉపయోగించవచ్చునని స్పష్టం చేశారు.