Representative image

Viral Fever Cases on Rise in Kerala: రుతుపవనాల రాకతో కేరళ అంతటా అంటు వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్త చర్యలను మరింత పటిష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జ్వరాల కేసులు నమోదయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్ (ఎలుక జ్వరం), వైరల్ ఫీవర్ వంటి వైరల్, బ్యాక్టీరియా వ్యాధులు రాష్ట్రవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం 877 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.

కేరళలో డెంగ్యూ, ఎలుకల జ్వరంతో రెండు వారాల్లోనే 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. డెంగ్యూ జ్వరంతో 17 రోజుల్లో మొత్తం 13 మంది చనిపోగా, గత ఆరు నెలల్లో 27 మంది ర్యాట్ ఫీవర్ మరణాలు నమోదయ్యాయి. కోవిడ్-19 వంటి లక్షణాలను కలిగి ఉన్న వైరల్ ఫీవర్‌తో చాలా మంది బాధపడుతున్నారని మనోరమ న్యూస్ నివేదించింది.

ఓరల్ సెక్స్ వల్ల గొంతు క్యాన్సర్‌ వస్తుందా, నోటి సెక్స్ అంటే ఏమిటి, ఈ శృంగారంపై వచ్చే వ్యాధులపై నిపుణులు ఏమంటున్నారు

ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రోజుకు 10 వేల మందికి పైగా ప్రజలు జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. సోమవారం ఒక్కరోజే 13 వేల మంది జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. జూన్ నెల ప్రారంభం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అంటు జ్వరాల వ్యాప్తి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,346 మంది చికిత్స పొందినట్లు తెలిపారు. కాగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కంటే.. ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్యే రెట్టింపుగా ఉంది.

వైరల్ ఫీవర్స్ తోపాటు డెంగీ (dengue), మెదడు వాపు కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 110 మంది డెంగీ బారిన పడినట్లు తేలింది. మరో 218 మందికి డెంగీ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా డెంగీ రోగులు ఎర్నాకులం జిల్లాకు చెందిన వారే ఉన్నారు. ఆ జిల్లాకు చెందిన 43 మందికి డెంగీ నిర్ధారణ కాగా, మరో 55 మందిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1,011 మంది డెంగీ బారిన పడ్డారు.

వీర్యం లేకుండా పిల్లాడు పుట్టే కొత్త టెక్నాలజీ, స్టెమ్ సెల్స్ సహాయంతో ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మానవ పిండం తయారు చేసిన శాస్త్రవేత్తలు

మెదడువాపు (leptospirosis) వ్యాధి బారిన పడే రోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే ఎనిమిది మందికి మెదడు వాపుగా తేలింది. మరో 14 మందికి ఈ లక్షణాలు కనిపించాయి. ఈనెలలో ఇప్పటి వరకూ 76 మందికి మెదడు వాపు వ్యాధి సోకగా.. మరో 116 మందిలో లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రజలు స్వీయ మందులకు దూరంగా ఉండాలని, ఇన్‌ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. ఎర్నాకులంలో శనివారం నాటికి జ్వరపీడితుల సంఖ్య 1000 దాటింది. పలువురు వివిధ ఆసుపత్రుల్లో చేరుతున్నారు.ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. చాలా ఆసుపత్రుల్లో ఫీవర్ వార్డులు దాదాపు నిండిపోయాయి.

అయితే వర్షాకాలానికి ముందు పరిశుభ్రత చర్యలు చేపట్టడంలో స్థానిక ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయని ఆరోపించారు. కొచ్చి నగరంలో వివిధ ప్రాంతాల్లో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. పొలాల్లో పనిచేసే వ్యక్తులు ఎలుకల జ్వరానికి గురవుతారని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. అందువల్ల వారు చేతి తొడుగులు మరియు బూట్లు ధరించాలి. ఆరోగ్య కార్యకర్తల సలహా మేరకు వారానికి ఒకసారి 'డాక్సీసైక్లిన్' టాబ్లెట్‌ను కూడా తీసుకోవాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేసింది. రోగాలు ఇతరులకు వ్యాపించకుండా పటిష్ఠ చర్యలు చేపట్టింది. అవసరమైన మందులు నిల్వ ఉండేలా చూసుకోవాలని ఆసుపత్రులను ఆదేశించింది. ప్రతి ఆసుపత్రిలోనూ సిబ్బందితోపాటు వైద్యులు అందుబాటులో ఉండాలని తెలిపింది.