Coronavirus | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, December 15: భారతదేశంలో కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది, రికవరీ రేటు మెరుగుపడుతుంది. మరోవైపు దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో దేశంలో పరిస్థితులు త్వరలోనే సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు కూడా దగ్గర్లోనే ఉన్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వైరస్ వ్యాప్తి ఇప్పటికీ ఉన్నందున, టీకా పొందేవరకు అన్ని కొవిడ్ నిబంధనలు యధావిధిగా పాటించాలని ప్రభుత్వ వర్గాలు అప్రమత్తం చేస్తున్నాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 22,065 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం ఉదయం నాటికి 99,06,165కు చేరింది. నిన్న ఒక్కరోజే 354 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,43,709కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34,477 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 94,22,636 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం దేశంలో 3,39,820 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 95.12% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 3.43%  శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక డిసెంబర్ 14 వరకు దేశవ్యాప్తంగా 15,55,60,655 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 9,93,665 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

భారతదేశంలో కొవిడ్19కు వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానునట్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఇందుకు తగినట్లుగా టీకా పంపిణీపై కేంద్రం ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తుంది.  వ్యాక్సిన్ పంపిణీపై సోమవారం కేంద్రం  వివరణాత్మక  మార్గదర్శకాలు విడుదల చేసింది. మొదటి విడతలో హెల్త్‌కేర్ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 50 ఏళ్లు పైబడిన వారు, 50 ఏళ్ల లోపు ఉండి ఇతర దీర్ఘకాలిక రోగాలు కలిగిన వారితో సహా దాదాపు 30 కోట్ల మందికి టీకాలు వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.