Mumbai, Oct 30: మహారాష్ట్రలో జల్నా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న ఆరోపణలతో అత్తింటి వారు ఓ మహిళను (Maharashtra Woman), ఆమె ప్రియుడిని ట్రాక్టర్ చక్రాల కింద తొక్కించి (Woman Crushed Under Tractor) అత్యంత పాశవికంగా హత్యచేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. దారుణ ఘటన వివరాల్లోకెళితే..జల్నా జిల్లాకు చెందిన మరియా అనే మహిళ(32)కు చపల్‌గావ్‌కు చెందిన ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే పదేళ్ల క్రితమే భర్త మరణించడంతో అప్పటి నుంచి అత్తింట్లోనే ఉంటూ జీవితం గడుపుతోంది.
అదే గ్రామానికి చెందిన వివాహితుడైన హర్బక్ భగవత్(27)తో మరియాకు ఏర్పడిన పరిచయం కొద్ది కాలానికి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అత్తింటి వారు ఇద్దరిని మందలించారు. ఇలాంటి పనులు మానుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినప్పటికీ ఇద్దరిలో మార్పు రాలేదు. మార్చి 30న ఇద్దరూ కలిసి రహస్యంగా గుజరాత్‌కు పారిపోయారు. దీంతో మరియా కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 22న వారి జాడ కనుక్కొని పోలీసులు, మహారాష్ట్రకు తీసుకువచ్చారు.
ఇక అప్పటి నుంచి వీరిద్దరు తమ గ్రామంలోనే సహజీవనం మొదలుపెట్టారు. దీంతో కోపోద్రిక్తులైన మరియా మామ బాత్వెల్ సంపత్ లాల్జరే, అతడి కొడుకు వికాస్ లాల్జరే వారి మీద పగ పెంచుకున్నారు. ఈ క్రమంోనే అక్టోబరు 28న మరియా, భగవత్ మోటార్ సైకిల్‌పై పక్క ఊరికి వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్‌ను వాళ్ల మీదకు ఎక్కించగా.. టైర్ల కింద పడి తీవ్రగాయాలపాలయ్యారు. ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపే మృతి చెందారు.
ఈ ఘటనపై భగవత్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను, మరియాను వికాస్, సంపత్ కలిసి ఉద్దేశపూర్వకంగానే హత్యచేశారని ఆరోపించింది. ఈ క్రమంలో నిందితులను అరెస్టు చేసి, హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వికాస్ మరియు అతని తండ్రిపై ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశాం. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది ”అని ఇన్స్పెక్టర్ నందేద్కర్ (Ambad police inspector Aniruddha Nandedkar) అన్నారు.